– శివార్లలో విద్యార్థుల కోసం అదనంగా 100 ట్రిప్పులు
– విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు : టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా వంద ట్రిప్పులు ఆర్టీసీ బస్సుల్ని నడుపుతామని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యే లోపు హైదరాబాద్ సిటీలోకి 500 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెడతామన్నారు. ఆదివారంనాడాయన టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులతో బస్‌భవన్‌లో సమావేశం అయ్యారు. శివారు ప్రాంతాల్లో విద్యార్థుల రద్దీ, ఏర్పాటు చేస్తున్న బస్సుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని, సామాజిక బాధ్యతగా విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నామనీ, ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉందనే విషయం సంస్థ దష్టికి వచ్చిందని తెలిపారు. ”ఆ కారిడార్‌లోని కాలేజీలకు దాదాపు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో 3వ వంతు బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందుకు అనుగుణంగా వారంరోజులుగా 8 ట్రిప్పులను అదనంగా నడుపుతున్నాం. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.” అని తెలిపారు. ఇబ్రహీంపట్నం కారిడార్‌లో అదనంగా 30 ట్రిప్పులు నడపాలని ఆదేశించారు. విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను హైదరాబాద్ శివారు విద్యాసంస్థల వరకు ఏర్పాటు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామనీ,. త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, సీపీఎం కష్ణకాంత్, సీటీఎం జీవనప్రసాద్, చీఫ్ ఇంజనీర్ (ఐటీ) రాజశేఖర్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్‌ఎంలు వరప్రసాద్, వెంకన్న పాల్గొన్నారు.