దశాబ్ద కాల ప్రేమ ప్రయాణం..

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్‌ పెయిర్‌ నాగశౌర్య, మాళవిక నాయర్‌ ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గూఢచారి, ఓ బేబీ’ వంటి అనేక విజయాలను పొందిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది.
నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఇప్పుడు ఈ చిత్రంలో వీరి కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతోంది.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక నాయర్‌ ఇద్దరూ ఫార్మల్‌ వింటర్‌వేర్‌ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. పోస్టర్‌లో అందమైన వస్త్రధారణతో, అంతకంటే అందంగా ఉన్న ఆ జంటను చూస్తుంటే.. ఈ ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్‌ని ఎప్పుడెప్పుడా చూస్తామా అనే ఆసక్తి కలగక మానదు.
న్యూ ఇయర్‌ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ ఎనౌన్స్‌మెంట్‌ వీడియోకి కూడా మంచి స్పందన లభించింది. ఆ వీడియోలో శ్రీనివాస్‌ అవసరాలతో కాల్‌ మాట్లాడిన హీరో,హీరోయిన్లు సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌లు లేకపోవడంపై చర్చించారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించబోతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల తెలిపారు. ఆయన రాసిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.
గతంలో నాగశౌర్య-శ్రీనివాస్‌ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్‌, ఈ చిత్రానికీ సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.

Spread the love