నిత్యం మనసు లోలోన మాటాడుతోంది
మనాది గుండెను మెలిపెడుతోంది
బతుకుబాట భారమై సాగుతూంది
బాధ్యత మాత్రం లబ్ డబ్ మని ధ్వనిస్తోంది…
కడుపులో దుఃఖం రెట్టింపు అవుతోంది
తీరని బాధ గుండెని కప్పేస్తోంది
కనుల నిండా కన్నీరు ఉబుకుతోంది
అమ్మ… అమ్మ ఇక కనిపించకుంది…
కళ్ళనిండిన కన్నీరు ఇగిరిపోతోంది
ఆకాశంలో దుఃఖ మేఘం ఆవరిస్తోంది
హృదయ వేదన తిరిగి కన్నీరు వర్షిస్తోంది
అమ్మ… అమ్మ ఇకనుండి కనిపించనంది…
నుదుటిగీత చదవాలనే తపనైతే వుంది
బ్రహ్మ లిఖితం మార్చడం అసాధ్యమేనంది
అంతరిక్షం దాటి ఓ ఆశీర్వచన మంత్రం
నిత్యం వినవస్తోంది
వీడిన మాతృఛాయ వెన్నంటే వుంది?
గుండెతడి ఆత్మీయ స్పర్శకి నోచుకుంటుందా?
మనసు రోదన దిగంతాల కావల చేరుకుంటుందా?
నిజంగా నా మాటనకడ వినపిస్తోందా?
”అమ్మా… ఎట్లున్నవే”?
– అశోక్ గుంటుక, 9908144099