దూదిమెట్ల బాలరాజుతో ఉన్ని అభివృద్ధి చైర్మెన్‌ భేటీ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మెన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌తో జాతీయ ఉన్ని అభివృద్ధి బోర్డు చైర్మెన్‌ గోర్ధన్‌ రైఖా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉన్ని అభివృద్ధికి తీసుకున్న చర్యలను రైఖా వివరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని గొర్రెకాపరుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటివరకు ఐదువేల కోట్లు ఖర్చు చేసి 3.93 లక్షల లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీపై 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇంకా రూ. 6,083 కోట్లతో రెండవ దశలో మిగిలిన మూడున్నర లక్షల మంది లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. గొర్రెలతో పాటు మందులు, దాణా, బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫెడరేషన్‌ ఎండీ డాక్టర్‌ రాంచందర్‌ మాట్లాడుతూ 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా సంచార పశువైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love