– ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు : ఏఐఎఫ్‌బీ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ మతోన్మాద జాతీయవాదం దేశానికి ప్రమాదకరంగా మారిందని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్‌బీ) జాతీయ ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ 19 వ జాతీయ మహాసభ ముగింపు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసివచ్చే వామపక్ష, ప్రజాస్వామ్య, ప్రగతిశీల పార్టీలతో కలిసి మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని మహాసభ తీర్మానించినట్టు తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో మితవాద దాడికి తెరలేచిందన్నారు. మితవాద నయా-ఉదారవాద ఆర్థిక విధానాల కలయిక, హిందూత్వ దాడులు దేశ పురోగతికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో కలిసి ఎదుర్కోవటమే మార్గమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి జాతీయ భద్రతా సమస్యను ఎజెండా మీదికి తెస్తున్నదన్నారు.ప్రభుత్వ రంగ ఆస్తులని అదానీ, అంబానీ లాంటి మోసగాళ్లకు కారుచౌకగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నదని విమర్శించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై మోయలేని భారాల్ని మోపుతున్నదని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక చేతులెత్తేశారనీ, తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు గాలి మాటగా మిగిలాయని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, విద్యావేత్తలు, రచయితలు, దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీల భయంభయంగా బతుకుతున్నారని చెప్పారు. వారి కోసం ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫాసిజం, ద్వేషం, విభజన, ప్రజా వ్యతరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాల్సిన కర్తవ్యం ముందుకొచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏఐఎఫ్‌బీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌వీ ప్రసాద్, ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి, మహాసభల ఆహ్వాన సంఘం సభ్యులు సుందర రామరాజు, కె. తేజదీప్ రెడ్డి, బి. రాములు యాదవ్, జి. వంశీధర్ రెడ్డి, కొమ్మూరి వెంకటేష్ యాదవ్, ఆవుల శ్రీకాంత్ యాదవ్, సయ్యద్ తౌఫిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన కార్యదర్శిగా దేవరాజన్ ఎన్నిక..
ఈ మహాసభలలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నూతన జాతీయ కార్యదర్శి జి. దేవరాజన్ ఎన్నికకాగా ఆయనతోపాటు పార్టీ జాతీయ చైర్మెన్‌గా నరేన్ చటర్జీ, వైస్ చైర్మెన్‌గా పీవీ కతిరవన్, కేంద్ర కార్యదర్శులుగా అసిమ్ సిన్హా, దాలిరం, జ్యోతి రంజన్ మహాపాత్ర, సంజరు భట్టాచార్య, బండా సురేందర్ రెడ్డి, అమరేష్ కుమార్, మోహన్ నంది, గోవింద్ రారు, జి.ఆర్. శివశంకర్, బివాస్ చక్రవర్తిలతోపాటు 65 మంది జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైయ్యారు.