దేశానికో… అక్షర అశ్రులేఖ

తూములూరి వెంకటేశ్వరరావు గ్రూప్‌ 1 అధికారిగా వివిధ హోదాలలో పని చేసారు. ఒక నిబద్ధత, స్వేచ్ఛా స్వాతంత్య్ర పిపాస. సమసమాజ నిర్మాణం ఃసమాజం కోసం సాహిత్యంః అనే దృక్పధాన్ని బలంగా నమ్మి రచనలు చేస్తున్న అభ్యుదయ కవి.
ఈ దేశానికి కవి రాసిన ఒక అక్షర అశ్రు లేఖలో చైతన్య వంతమైన, భావోస్పోరక, శక్తివంతమైన కవితలెన్నో ఉన్నాయి. కవిత, కథ, వ్యాసం, వ్యంగ్య రచనలు.. చరిత్ర రచన మొదలైన సాహిత్య ప్రక్రియలు జనం పక్షపాతిగా… ప్రతి రచనలో అభ్యుదయ భావజాలాలు ఆవిష్కరించే వీరి కవితల్ని కొన్నింటిని ఆశ్వాదిద్దాం. పాబ్లోనెరుడా, ఖలీల్‌ జీబ్రాన్‌, కిల్లీ, రవీంద్రనాథ్‌ టాగూర్‌ లాంటి వారి విశిష్ట కవితల్ని అనువదించి ఈ సంపుటి చివర అందించారు. స్వీయ కవితల్లానే ఉంటాయి. కామ్రేడ్‌ నండూరి ప్రసాద్‌ రావు, కాస్ట్రో సున్నం రాజ్యయ్య, మల్లు స్వరాజ్యం లాంటి అగ్రశ్రేణి నేతలు మరణించిన సందర్భాలలో రాసిన స్మృతి కవితలూ ఉన్నాయి. చాలా కవితలు ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, నవతెలంగాణ లాంటి దిన పత్రికల్లో ప్రచురణై పాఠకాదరణ పొందాయి. మచ్చుకు కొన్ని కవితలు చూద్దాం.. దేశ పరిస్థితిని అశ్రులేఖఃలో రాస్తూ ఒక చోట ఇలా అంటారు. ఈ సంపుటికి శీర్షికగా పెట్టిన కవిత ఇది.
సింధూ నాగరికత విలసిల్లినది ఇచ్చోటనే కదా / వేదం జీవన నాదంగా మారింది ఈ జనులకే సదా! / అహింసను ఆవాహనం చేసింది ఈ గడ్డనే కదా! /…. నీ ఎదపై కాలిడని జాతి ఏదైనా మిగిలిందా? అంటారు (పేజీ. 1) ఈ దేశ పరిస్థితులు రాస్తూ చివరన అనేకానేక స్మృతుల స్మరణలో / నా కంట రాలిన అశ్రువు / ఆనందాశ్రువో… / దు:ఖాశ్రువో.. అర్థం కాకున్నదిఃః అంటూ అమృత భారతిని ఆర్ధ్రంగా అక్షరీకరించారు. వీర తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం లేని వారు తామే ఏదో చేసినట్లు సంబరాలు ఐలమ్మ వర్ధంతులు చేస్తున్నారు ఈనాడు… కుట్రచరిత (పేజీ. 9) కవితలో కషాయదళం వీరంగాన్ని నిరసిస్తూ…. ఃఃవిజయగర్జన తోలు కప్పుకున్న నక్కదేనని నమ్మబలుకుతుంటే / కనుల ముందు జరిగిన చరిత్రపై / కాషాయం కప్పుతుంటే / సాక్షీభూతమైన కనులెందుకో స్రవిస్తున్నాయి / రుధిరాన్ని / నీ తెంపరితనానికి నిరసగా రగులుతున్న ఆగ్రహ జ్వాలకు సంకేతంగాఃః అంటారు కవి. (అలనాటి పోరాట యోధుడు రావెళ్ళ, కవి తాతగారు). కదన కవాతుతో కర్షక ధీరులు అనే కవిత ఢిల్లీ రైతు పోరాట ప్రతిబింబంగా రాసారు.
మీరు ఈ దేశపు అన్నదాతలు కదా! ఇతరుల ఆకలి తీర్చడమే తప్ప / మీ ఆకలి నెరుగని అర్భకులు కదా/ మీకు విజయమే దక్కాలి సదా! (కవి వాక్కు వృథా పోదు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకున్నారు).
నీ పూజిత దేవాలయ హార్మ్యం, నా ప్రార్థిత మసీదు కుడ్యం, శ్రమలోకం చిందించిన స్వేదపు చిహ్నాలే అయినా, నన్నెందుకు వేరుగా చూస్తావ్‌? అని ప్రశ్నించే సాటి మతం వారి అంతర్మధన కవిత్వీ కరణ బాగుంది. (పేజీ. 70) మన కాలంలో స్వాతంత్య్రం పొందిన దక్షిణాఫ్రికాపై రాసిన కవిత అంతర్జాతీయ దృక్పథం కలిగిన మంచి కవిత. శ్వేత ప్రభుత్వ వెన్నులో వొణుకుజొచ్చింది / ప్రపంచపు నోరు / నల్లజాతి ప్రభంజనపు హోరు/ శ్వేతజాతి గుండెల్లో గునపాలు దించి గుబులు పుట్టించిన వేళ… దక్షిణాఫ్రికాలో వెలుగు కిరణం మెరిసిందిఃః అనే కవి ఈ అంతర్జాతీయవాది. కార్మికులపై, అత్యాచారాలపై, చిదిమివేయ బడ్డ చిన్నారులపై, మతన్మోదంపై, దేశంపై.. వానపై.. నేతలపై.. పల్లె ప్రకృతిపై అద్భుత కవితలు రాసిన కవి అభినందనీయులు.
దేశానికో అశ్రులేఖ
కవి : వి.ఆర్‌.తూములూరి
పేజీలు : 125, వెల : రూ.100/-,
ప్రతులకు : టి.వి.రావు, ఇ.నెం. 9-22/బి/ 99,
స్ట్రీట్‌ నెం. 6, బోడుప్పల్‌, హైదరాబాద్‌ – 092
సెల్‌ : 9705207945బీ
నవతెలంగాణ, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌లు

– తంగిరాల చక్రవర్తి , 9393804472

Spread the love