– ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఐపీఎస్ అధికారుకు గురుతర బాధ్యత ఉందనీ, దానిని సక్రమంగా నిర్వహించటంలో యువ ఐపీఎస్‌లు కీలక పాత్ర పోషించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శనివారం జరిగిన 74వ బ్యాచ్ యువ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. దేశం అమృత్ ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో యువ ఐపీఎస్ అధికారులుగా పోలీసు శాఖలో కీలక బాధ్యతలను నిర్వహించనున్న ఈ బ్యాచ్‌పై దేశానికి ఎన్నో ఆశలున్నాయన్నారు. ముఖ్యంగా దేశంలో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఐదేండ్లు కొనసాగాక తిరిగి ప్రజల తీర్పును కోరాల్సి ఉంటుందనీ, కాని ఐపీఎస్ అధికారులు నిర్విరామంగా ముప్పై ఐదేండ్లు సర్వీసులో కొనసాగి దేశానికి సేవ చేసే అవకాశాన్ని పొందుతారని తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడటంలో పోలీసులు, వారికి నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారులు చేసిన శ్రమ, చేసిన త్యాగాలు ఎనలేనివని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరస్తుల కుయుక్తులను పసిగట్టి దేశ ప్రజలకు శాంతిని ప్రసాదించడంపై ఐపీఎస్ అధికారులు ముందుండాలని అమిత్‌షా కోరారు. గత ఎనిమిదేండ్లలో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణిచివేయడంలో పోలీసులు మంచి పాత్రను పోషించారన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి వచ్చే ముప్పై ఏండ్లలో యువ ఐపీఎస్‌లు చేసే కృషి కీలకమైందని అన్నారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌లుగా కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐపీఎస్‌లను ఆయన అభినందించారు. ఎన్పీఏ డైరెక్టర్ ఎస్ రాజన్ మాట్లాడుతూ.. యువ ఐపీఎస్‌లు 195 మందికి శిక్షణ కాలంలో నేరాల అదుపు, సైబర్ క్రైమ్, వైట్ కాలర్ నేరాలు, ఉగ్రవాదం, తీవ్రవాదం మొదలుకుని శాంతి భద్రతల పరిరక్షణ వరకు అనేక అంశాలలో కీలకమైన శిక్షణను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభకనబరిచిన పలువురికి అమిత్ సా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హౌంశాఖ కార్యదర్శి అజరు భల్లా, కేంద్ర ఐబీ చీఫ్ రేఖలతో పాటు వివిధ రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర పారామిలటరీ బలగాల చీఫ్‌లు హాజరయ్యారు.