దొడ్డి కొమురయ్య స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం

–  బీజేపీకి అదానీ, అంబానీల సంక్షేమమే ముఖ్యం
–  దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-సంగారెడ్డి
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, ఉద్యమానికి ఆయననే స్ఫూర్తిగా తీసుకున్నామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావ అన్నారు. బీసీల సంక్షేమం బీజేపీకి అవసరం లేదని, అదానీ, అంబానీల సంక్షేమమే ముఖ్యమని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కురుమసంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. టీఎస్‌ఆర్‌ గార్డెన్లో కురుమ సంఘం సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఉగాది, శ్రీరామనవమి తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని, యూనిట్‌ కాస్ట్‌ కూడా పెంచామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. బీసీల కోసం ఒక శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. కేంద్రం బడ్జెట్లో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. మెదక్‌లో కురుమ భవనం నిర్మిస్తామన్నారు. హైదరాబాదులో కురుమ భవనానికి రూ.రెండు కోట్లు అదనంగా కేటాయించామన్నారు. కొమురెల్లి మల్లన్నకు పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు. కొమురెల్లి మల్లన్నగుడికి చైర్మెన్‌గా సంపత్‌ కురమను చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్‌, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్‌, మాణిక్‌రావు, కలెక్టర్‌ శరత్‌, నాయకులు నగేష్‌ యాదవ్‌, డాక్టర్‌ శ్రీహరి, బీరయ్య యాదవ్‌, ఐసి.మోహన్‌, జూలకంటి ఆంజనేయులు, పోచారం రాములు, డీసీఎంఎస్‌ శివకుమార్‌, డీసీసీబీ వైస్‌ చైర్మెన్‌ పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love