ద్వి శతక కిషన్‌


131 బంతులు, 24 బౌండరీలు, 10 సిక్సర్లు, 210 పరుగులు. 24 ఏండ్ల యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ బంగ్లాదేశ్‌పై సృష్టించిన సునామీ ఇది. కెరీర్‌ తొమ్మిదో ఇన్నింగ్స్‌లోనే ద్వి శతకం దంచేసిన కిషన్‌ ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 126 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ బాదిన కిషన్‌ బంగ్లాదేశ్‌ బౌలర్లపై దండయాత్ర చేశాడు. విరాట్‌ కోహ్లి (113) సైతం శతకంతో చెలరేగటంతో భారత్‌ 409 పరుగుల భారీ స్కోరు సాధించింది.
– 131 బంతుల్లోనే 210
– శతకబాదిన విరాట్‌ కోహ్లి
– బంగ్లాపై భారత్‌ భారీ విజయం
నవతెలంగాణ-చిట్టగాంగ్‌
ఇషాన్‌ కిషన్‌ (210, 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లు) చిట్టగాంగ్‌లో చిచ్చరపిడుగల్లె చెలరేగాడు. 126 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ సాధించిన కిషన్‌ భారత్‌కు భారీ స్కోరు అందించాడు. విరాట్‌ కోహ్లి (113, 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడేండ్ల విరామానికి తెరదించుతూ వన్డేల్లో సెంచరీ కొట్టాడు. టాప్‌ ఆర్డర్‌లో కిషన్‌, కోహ్లి రెండో వికెట్‌కు 290 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 409/8 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పేసర్లు శార్దుల్‌ (3/30), ఉమ్రాన్‌ (2/43) నిప్పులు చెరగటంతో ఛేదనలో బంగ్లాదేశ్‌ కుదేలైంది. 34 ఓవర్లలోనే 182 పరుగులకు కుప్పకూలింది. 227 పరుగుల భారీ తేడాతో భారత్‌ గెలుపొందింది. 2-1తో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ కైవసం చేసుకోగా, పరుగుల పరంగా రికార్డు విజయంతో టీమ్‌ ఇండియా ఊరట చెందింది. మిరాకల్‌ మ్యాన్‌ మిరాజ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలువగా, ఇషాన్‌ కిషన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
ఖతర్నాక్‌ కిషన్‌ : తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఆరంభంలోనే ధావన్‌ (3) వికెట్‌ కోల్పోయింది. దీంతో అభిమానుల్లో మరో టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం తప్పదనే నైరాశ్యం. కానీ ఇషాన్‌ కిషన్‌ సునామీ ఊహించలేదు. కెరీర్‌ తొమ్మిదో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌ పట్టిన కిషన్‌.. ఆరంభం నుంచీ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. మరో ఎండ్‌లో కోహ్లి (113) అండతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కిషన్‌.. శతకం చేరుకునేందుకు పెద్దగా కష్టపడలేదు. 36 బంతుల్లోనే మరో 50 పరుగులు పిండుకున్నాడు. 85 బంతుల్లో కెరీర్‌ తొలి సెంచరీ బాదిన కిషన్‌ ముందు బంగ్లా బౌలర్లు తేలిపోయారు. శతకం అనంతరం కిషన్‌ వేగం టాప్‌ గేర్‌లోకి దూసుకెళ్లింది. మరో 41 బంతుల్లోనే 100 పరుగులు పిండుకున్న కిషన్‌ అత్యంత వేగంగా, అతి పిన్న వయసులో ద్వి శతకం సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్‌ శర్మ 26 ఏండ్ల వయసులో ఆసీస్‌పై సాధించిన డబుల్‌ శతక రికార్డును తిరగరాశాడు. 23 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగిన కిషన్‌ ధనాధన్‌ షో చూపించాడు. డబుల్‌ సెంచరీ అనంతరం బౌండరీ, సిక్సర్‌ సంధించిన కిషన్‌.. ఆ తర్వాత వికెట్‌ కోల్పోయాడు.
పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లి శతకంతో విజృంభించాడు. నాలుగు ఫోర్లతో 54 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్‌ మెరుపు సిక్సర్‌తో 85 బంతుల్లోనే సెంచరీ చేరుకున్నాడు. కిషన్‌ తోడుగా అరివీర భయానక భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లి వన్డేల్లో శతక దాహం తీర్చుకున్నాడు. కిషన్‌, కోహ్లి క్రీజులో ఉండగా భారత్‌ 500 మార్క్‌ దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఇద్దరి నిష్క్రమణతో ఇన్నింగ్స్‌ వేగం తగ్గింది. సుందర్‌ (37), అక్షర్‌ (20) చివర్లో మెరిశారు. శ్రేయస్‌ (3), రాహుల్‌ (8) నిరాశపరిచారు.
బంగ్లా ఢమాల్‌ : 410 పరుగుల రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్‌ చేతులెత్తేసింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. షకిబ్‌ (43), లిటన్‌ దాస్‌ (29), యాసిర్‌ అలీ (25), మహ్మదుల్లా (25) భారత బౌలర్లపై ధాటిగా పరుగులు చేయటంలో విఫలమయ్యారు. అనాముల్‌ (8), ముష్ఫీకర్‌ (7), అఫిఫ్‌ (8), మిరాజ్‌ (3), హోస్సేన్‌ (0) తేలిపోయారు. భారత బౌలర్లలో శార్దుల్‌ (3/30), ఉమ్రాన్‌ (2/43), అక్షర్‌ (2/22) వికెట్ల వేటలో విజృంభించారు. 34 ఓవర్లలో 182 పరుగులకే బంగ్లాదేశ్‌ కథ ముగిసింది.
భారత్‌ ఇన్నింగ్స్‌ : ధావన్‌ (ఎల్బీ) మిరాజ్‌ 3, కిషన్‌ (సి) దాస్‌ (బి) టస్కిన్‌ 210, కోహ్లి (సి) మిరాజ్‌ (బి) షకిబ్‌ 113, శ్రేయస్‌ (సి) దాస్‌ (బి) హోస్సేన్‌ 3, రాహుల్‌ (బి) హోస్సేన్‌ 8, సుందర్‌ (బి) షకిబ్‌ 37, అక్షర్‌ (బి) టస్కిన్‌ 20, శార్దుల్‌ (సి) దాస్‌ (బి) ముస్తాఫిజుర్‌ 3, కుల్దీప్‌ నాటౌట్‌ 3, సిరాజ్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు :9, మొత్తం :(50 ఓవర్లలో 8 వికెట్లకు) 409.
వికెట్ల పతనం : 1-15, 2-305, 3-320, 4-344, 5-344, 6-390, 7-405, 8-409.
బౌలింగ్‌ : ముస్తాఫిజుర్‌ 10-0-66-1, టస్కిన్‌ 9-1-89-2, మిరాజ్‌ 10-0-76-1, హోస్సేన్‌ 9-0-78-2, షకిబ్‌ 10-0-68-2, అఫిఫ్‌ 1-0-14-0, మహ్మదుల్లా 1-0-11-0.
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ : అనాముల్‌ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 8, లిటన్‌ (సి) శార్దుల్‌ (బి) సిరాజ్‌ 29, షకిబ్‌ (బి) కుల్దీప్‌ 43, ముష్ఫీకర్‌ (బి) అక్షర్‌ 7, యాసిర్‌ (ఎల్బీ) ఉమ్రాన్‌ 25, మహ్మదుల్లా (ఎల్బీ) సుందర్‌ 20, అఫిఫ్‌ (సి) ఉమ్రాన్‌ (బి) శార్దుల్‌ 8, మిరాజ్‌ (సి) సిరాజ్‌ (బి) శార్దుల్‌ 3, టస్కిన్‌ నాటౌట్‌ 17, హోస్సేన్‌ (ఎల్బీ) శార్దుల్‌ 0, ముస్తాఫిజుర్‌ (బి) ఉమ్రాన్‌ 13, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం : (34 ఓవర్లలో ఆలౌట్‌) 182.
వికెట్ల పతనం : 1-33, 2-47, 3-73, 4-107, 5-124, 6-143, 7-145, 8-148, 9-149, 10-182.
బౌలింగ్‌ : సిరాజ్‌ 5-0-27-1, శార్దుల్‌ 5-0-30-3, అక్షర్‌ 5-0-22-2, ఉమ్రాన్‌ 8-0-43-2, కుల్దీప్‌ 10-1-53-1, సుందర్‌ 1-0-2-1.

Spread the love