ద్వేషగీతం

”ఎక్కడ ఎన్నికలు మొదలవుతాయో! ఎక్కడ అధికారం కోసం తమ బాహువులను తమ పార్టీ చాస్తుందో! ఎక్కడ తమ పాలనకు వ్యతిరేకత వెల్లువెత్తుతుందో! అక్కడ కచ్చితంగా మత విద్వేషం రగుల్కుంటుంది. ఉన్మాదం తలలెత్తుతుంది.” ఇది అక్షరాలా ఆచరిస్తూ ఉన్నది కాషాయ పరివారం. ఆ ద్వేషగీతం ఇప్పుడు కర్నాటకలో గొంతెత్తుతోంది. అదిప్పుడు అనాగరిక నినాదాలకు పూనుకొంటున్నది. ఈ మధ్య ఆ రాష్ట్రంలో జరిగిన ఓ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నళిన్‌కుమార్‌ కాతీల్‌ తీవ్రమైన పిలుపులిచ్చాడు. టిప్పుసుల్తాన్‌ అనుచరులను, అభిమానులను వెంటాడి, వేటాడి అంతమొందించాలని బహిరంగంగానే తన విషాన్ని వెళ్ళగక్కాడు. ‘మనము శ్రీరాముడి భక్తులం. హనుమంతుడి భక్తులం. టిప్పు సుల్తాన్‌ భక్తులం కాదు. ఆ సుల్తాన్‌ భక్తులు బతికి ఉండటానికి వీలుల్లే చంపేయండి’ అని అనాగరికాదేశం జారీ చేశాడు. ఇలాంటి ప్రకటనలు, వ్యాఖ్యానాలూ, పిలుపులు ఇప్పుడు కొత్తేమీ కాదు, ప్రజ్ఞాసింగ్‌, రాజాసింగ్‌ మొదలైన కాషాయ నాయకులు గతంలోనూ ఇప్పుడు కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. ఇంత బహిరంగంగా చంపమని కోరినా, పిలుపిచ్చినా ఎవరూ ఏమీ అనరు. ఏ చట్టమూ వారిని శిక్షించదు. పోలీసులూ, కేసులూ ఏమీ ఉండవు. అదే మరి అధికార విద్వేషానికుండే సౌలభ్యం. రాజ్యమే ఉన్మాద పక్షమైనప్పుడు జరిగేది అంతేగా. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన టిప్పుసుల్తాన్‌ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన యోధుడు. అతని చరిత్రను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజల మధ్య విభజనను సృష్టిస్తోంది కాషాయ దళ రాజకీయం. అతని జయంతిని కూడా వివాదాస్పదం చేసి అడ్డుకున్నది. అతను ముస్లిం కావడమే వారి ద్వేషానికి కారణం. స్వాతంత్య్రోద్యమ చరిత్రనే వక్రీకరించడానికి పూనుకొనే వాళ్లు ఇక టిప్పు విషయంలో ఎందుకు ఊరుకుంటారు! టిప్పుసుల్తాన్‌ చాలా మంది హిందువులను బలవంతంగా మతమార్పిడి చేయించాడని సంఫ్‌ు పరివారం ఆరోపిస్తున్నది. అంతే కాదు, అతను ఎప్పుడూ యుద్ధం చేయలేదని, యుద్ధంలో చనిపోలేదనీ ప్రచారం చేస్తున్నది. కానీ దక్షిణ కర్నాటకలో ఇప్పటికీ ముద్దుగా తమ పిల్లలను టిప్పు సుల్తాన్‌ అని అనేక మంది ప్రజలు పిలుచుకుంటారు. కర్నాటక సాంస్కృతిక రాజధాని మైసూర్‌ రాజ్యాన్ని బ్రిటిష్‌ వారి నుండి కాపాడుకోవడానికి వారితో వీరోచితంగా పోరాడిన ధీరుడిగా టిప్పు ప్రసిద్ధుడు. అతని మీద వీళ్లు చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో, మతతత్వంతో చేస్తున్నవే. వాటిలో చారిత్రిక వాస్తవాలు లేవు. వాస్తవంగా చరిత్రకారులు, రచయితలు చెబుతున్నదేమంటే, ఆనాటి తన రాజ్యంలో ఉన్న దాదాపు 156 హిందూ దేవాలయాలను తన నిధులు కేటాయించి అభివృద్ధి పరిచాడు. ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన శృంగేరీ మఠాన్ని మరాఠా దాడుల నుండి రక్షించి కాపాడి దాని విస్తరణకు టిప్పు పాటుపడ్డాడని చెబుతారు. అంతే కాదు రంగనాథస్వామి దేవాలయాన్ని కూడా రక్షించి అభివృద్ధి చేశాడు. శ్రీ కంఠేశ్వర ఆలయానికి పదివేల బంగారు నాణేలు చందాగా ఇచ్చి ఆదుకున్నాడు. తన రాజ్యానికి శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని చివరికంటా కొనసాగించడమే కాక 4వ మైసూర్‌ యుద్ధంలో శ్రీరంగ పట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలోనే అమరుడయ్యాడు. టిప్పు సుల్తాన్‌ పరిపాలనాదక్షుడు. తన పాలనలో అనేక సంస్కరణ లను తీసుకొచ్చినవాడు. అతని సైన్యంలో హిందువులను పెద్ద యెత్తున నియమించాడు. మంత్రులుగానూ ఉన్నారు. మైసూర్‌ పులిగా పేరుగాంచిన టిప్పు ఆధునికుడు. సామ్రాజ్య దురాక్రమణకు ప్రాణాలెదురొడ్డి పోరాడినవాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ చరిత్రను తిరగరాయాలని వీళ్లు తెగ ఆరాటపడుతున్నారు. చరిత్రలోకి వెళ్లి మతోన్మాదాన్ని రెచ్చగొడు తున్నారు. మత పరంగా విభజనను తీసుకువచ్చి రాజకీయ అధికారాన్ని పొందటానికి వాళ్లకున్న ఏకైక సాధనం ఇది. ఇంత క్రితం మన తెలంగాణలోని కాషాయ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా ‘మా మత ధర్మ పరిరక్షణ’ కోసం ఎవరినైనా చంపటానికి సిద్ధమని అన్నాడు. చంపుతామని ఓపెన్‌గా ప్రకటిస్తున్నారు. నిన్న రాజస్తాన్‌ రాష్ట్రంలో భరత్పూర్‌ జిల్లాలో గోరక్షకుల పేరుతో భజరంగేయులు ఇద్దరు ముస్లిం యువకులను అపహరించి హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక కేంద్ర ఎన్నికలు ముంచుకొస్తే ఇంకెన్ని దారుణాలకు పాల్పడతారోనని ప్రజలు భయపడుతున్నారు. మానవహననమే వీరి ఎన్నికల వాగ్దానంగా వినపడుతున్నది. ఈ ద్వేషగీతానికి చరమగీతం పాడాల్సి ఉంది.

Spread the love