నాగలికి నానాఅవస్థలేనా?

– రైతు బంధే సర్వరోగ నివారిణా?
– అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో నామమాత్రమే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవ’సాయం’ అందడం లేదు. అన్నింటికి రైతు బంధు పథకమే సర్వరోగ నివారిణి అన్నట్టుగా బడ్జెట్‌లో చూపించింది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంతోనే అన్నదాత కష్టాలు తీరవు. సన్న, చిన్నకారు రైతులకు జీవనాధారమైన అనుబంధ రంగాలను పట్టించుకోలేదు. ఇప్పటికే వ్యవసాయం చేయలేక నానా అవస్థలు పడుతున్న రైతన్నకు ఈ బడ్జెట్‌ కూడా ఊరటనివ్వలేదు. గత రెండేండ్లుగా అధిక వర్షాలు పడి లక్షల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. ఒక్కొక్కసారి రెండుసార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. దీంతో రైతులు తీవ్రమైన అప్పుల బారిన పడ్డారు. కానీ బడ్జెట్‌ (2023-24) ప్రకృతి విపత్తులకు నిధులు కేటాయించలేదు. దీంతో రైతులకు నష్టపరిహారం అండడం లేదు. పైగా దిగుబడులు తగ్గాయి. పలు దఫాలుగా సాగు చేయడం వలన విత్తనాలు, ఎరువుల, ఇతర అవసరాల కోసం అన్నదాతలు చేసిన అప్పులకు ఈ బడ్జెట్‌ భరోసా ఇవ్వలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో రైతు బంధుకు రూ.15075 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే ఈసారి మరో రూ 300 కోట్లు అదనంగా కేటాయించింది.రైతు బీమాకు గతేడాది కంటే ఈసారి రూ 123 కోట్లు పెంచింది. రైతు బంధు ఇవ్వడం ద్వారా రైతుకు మేలు చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుత్వం…ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు. ధర స్థిరకరణకు కూడా నిధులు ఈసారి తగ్గించింది. పత్తి, మిరప, పసుపు ధరలు క్ష్షీణించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు దళారులపైన్నే ఆధారపడాల్సి వస్తుంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న మార్కెట్‌ ఇంటర్వెషన్‌ ఫండు నిమిత్తం గతేడాది రూ 377 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ 75 కోట్లు మాత్రమే కేటాయించింది. ఒకేసారి రూ 300 కోట్లు తగ్గించడం ద్వారా రైతులను గాలికొదిలేసింది. పండ్ల తోటలు, కూరగాయాల రైతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉద్యానవన శాఖకు ఈసారి మొండిచేయి చూపింది. గత బడ్టెట్‌లో రూ 1053 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ919 కోట్లకే పరిమితమైంది. పెద్ద పెద్ద భూస్వాములకు ఉపయోగపడే ఫామ్‌ ఆయిల్‌ సాగు కోసం మాత్రమే వెయ్యి కోట్లు కేటాయించింది. ఫామ్‌ ఆయిల్‌ సాగుతో అనేక ఇబ్బందులు వస్తాయన్న నిపుణుల అభిప్రాయాలను సర్కారు పెడచెవిన పెట్టింది. పశుసంవర్థక శాఖకు గతేడాది రూ 2,345 కోట్లు కేటాయించగా, ఈసారి రూ 1,481 కోట్లతో సరిపెట్టింది.
దాదాపు రూ 864 కోట్ల కోత పెట్టింది. చేపల పెంపకం దార్లకు రూ 384 కోట్లు కేటాయించి కాస్త ఊరటనిచ్చింది. మార్కెటింగ్‌ శాఖకు గతంలో రూ 10 కోట్ల కేటాయించిన సర్కారు ఈయేడాది 12 కోట్లు కేటాయించినప్పటికీ ఏ మాత్రం సరిపోవు. వ్యవసాయానికి అత్యంత కీలకమైన యాంత్రీకరణకు ఈసారి బడ్జెట్‌ జీవో చేసింది. దీని కోసం గతేడాది కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేదు. ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గతేడాది నిధులనే ఈసారి కేటాయించింది. ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనలకు ప్రోత్సహించేలా బడ్జెట్‌ లేదు. దీంతో వ్వవసాయ రంగానికి ఈ బడ్జెట్‌ అందించే సాయమేమీ లేదని విమర్శలొస్తున్నాయి.

Spread the love