నాగాలాండ్‌ చరిత్రలో సరికొత్త రికార్డు.. అసెంబ్లీలోకి తొలి మహిళ

నవతెలంగాణ -కోహిమా
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త చరిత్రను లిఖించాయి. తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీలో కాలుమోపనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు రికార్డు సృష్టించారు. నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె దిమాపుర్‌ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎల్‌జేపీ(రామ్ విలాస్‌)కి చెందిన అజితో జిమోమిపై ఈమె గెలుపొందారు. ఈసారి నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడిన నలుగురు మహిళల్లో ఈ 48 ఏళ్ల న్యాయవాది, సామాజిక కార్యకర్త కూడా ఒకరు. ఎన్‌డీపీపీకే చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌతునొ క్రుసో ఆధిక్యంలో ఉన్నారు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం 1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. అప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడం గమనార్హం. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో హెకానీ విజయం ఖరారైంది.

Spread the love