నాదల్‌ శుభారంభం

– మెద్వదెవ్‌, సిట్సిపాస్‌ కూడా..
– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
– మహిళల సింగిల్స్‌లో స్వైటెక్‌, సక్కారి గెలుపు
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన రఫెల్‌ నాదల్‌ శుభారంభం చేశాడు. సోమవారం నుంచి ప్రారంభమైన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలిరౌండ్‌ పోటీలో నాదల్‌ 7-5, 2-6, 6-4, 6-1తో బ్రిటన్‌కు చెందిన జాక్‌ డ్రాపెర్‌పై సునాయాసంగా గెలిచాడు. ఈ మ్యాచ్‌లో డ్రాపెర్‌ గాయపడడంతో పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించలేకపోయాడు. రెండోరౌండ్‌లో నాదల్‌ మెక్‌ డొనాల్డ్‌(అమెరికా)తో తలపడనున్నాడు. ఇతర పోటీల్లో 7వ సీడ్‌ డానియేల్‌ మెద్వదెవ్‌(రష్యా) 6-0, 6-1, 6-2తో గిరోన్‌(అమెరికా)పై, 3వ సీడ్‌, గ్రీక్‌కు చెందిన సిట్సిపాస్‌ 6-3, 6-4, 7-6(8-6)తో అన్‌సీడ్‌ ఫ్రాన్స్‌కు చెందిన హైస్‌పై గెలిచి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. మరో హోరాహోరీ పోటీలో మసెట్టి(ఇటలీ) 4-6, 1-6, 7-6(7-0), 6-2, 6-7(4-10)తో అన్‌సీడెడ్‌ హర్రిస్‌(దక్షిణాఫ్రికా) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇతర పోటీల్లో 6వ సీడ్‌ అగర్‌(కెనడా), 11వ సీడ్‌ నొర్రి(బ్రిటన్‌) తొలిరౌండ్‌ పోటీలో గెలుపొందగా.. 21వ సీడ్‌ కోరిక్‌(క్రొయేషియా) 3-6, 3-6, 3-6తో లెహెక్రా(చెక్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు.
స్వైటెక్‌, కీస్‌ గెలుపు..
మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌(పోలండ్‌), 10వ సీడ్‌ కీస్‌(అమెరికా) రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. స్వైటెక్‌ 6-4, 7-5తో నేమియర్‌(జర్మనీ)పై సునాయాసంగా గెలుపొందగా.. కీస్‌ 6-4, 3-6, 6-2తో బ్లింకోవా(రష్యా)పై చెమటోడ్చి నెగ్గింది. ఇతర పోటీల్లో 32వ సీడ్‌ టిచ్మన్‌(స్విట్జర్లాండ్‌), 22వ రైబకినా(కజకిస్తాన్‌), 20వ సీడ్‌ క్రేజికోవా(చెక్‌), 17వ సీడ్‌ ఓస్టాపెంకో(లాత్వియా) ప్రత్యర్థులపై గెలిచారు.

Spread the love