నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు…

         ”బెయిల్‌ వచ్చిన తర్వాత కూడా నన్ను జైల్లో ఉంచారు. ఈ రెండు సంవత్సరాలు నాకు చాలా కఠినంగా గడిచాయి. అయితే నేను ఎప్పుడూ భయపడలేదు. ఇకముందూ భయపడను. నేనిప్పుడు నా పోరాటాన్ని క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తాను” – సిద్దిఖీ కప్పన్‌.
తన పని తాను చేయడానికి ప్రయత్నించినందుకు 850 రోజుల కస్టడీ తర్వాత గురువారం ఉదయం జైలు నుండి విడుదలయ్యాడు జర్నలిస్ట్‌ సిద్ధిఖీ కప్పన్‌. ఇప్పటికైనా కప్పన్‌ బెయిల్‌పై విడుదలవ్వడం ఒక ఊరట. కానీ అతను ఏ కారణంచేత నేరస్థుడయ్యాడనేది మాత్రం ప్రజాస్వామ్యానికి ఇంకా ఓ సవాలుగానే మిగిలివుంది. హత్రాస్‌లో ఓ దళిత బాలికపై అమానవీయంగా దాడిచేసి చెరిచి చంపిన కిరాతక పర్వాన్ని రిపోర్టింగ్‌ చేయాలనుకోవడమే కప్పన్‌ నేరమైపోయింది. మార్గమధ్యంలోనే అరెస్టు చేసి ‘క్రూరమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)’ కింద జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన విడుదల ఆనందించ తగినది కాగా, ఈ సందర్భంగా ఆయన ‘క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతా’ నని చేసిన ప్రకటన ఆహ్వానించ తగ్గది.
ప్రస్తుతం జర్నలిస్టులపై నిర్బంధం గతమెన్నడూ ఎరుగనంత తీవ్రంగా కొనసాగుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వమేర్పడ్డాక అది పరాకాష్టకు చేరింది. రిపోర్టర్స్‌ వితవుట్‌ ఫ్రాంటియర్స్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ ప్రకారం 180 దేశాల్లో 2021లో మనస్థానం 142 కాగా, ఇప్పుడు 150వ స్థానం. కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే) ప్రచురించిన ”జైలు జనాభా లెక్కల” ప్రకారం, డిసెంబర్‌ 1, 2022 నాటికి, భారతదేశంలో ఏడుగురు జర్నలిస్టులు ఖైదీలుగా ఉంటే, అందులో ఆరుగురి మీద ‘ఉపా’ కిందనే అభియోగాలు మోపడం గమనార్హం. ఇది తీవ్రవాద నిరోధక చట్టం. కానీ అత్యంత ఆశ్చర్యకరంగా అసమ్మతినీ, అభిప్రాయాలనూ. ప్రజాప్రయోజన జర్నలిజాన్నీ అణిచివేసేందుకే ఉపయోగించబడు తోందన్నది మన కళ్ళముందరి సత్యం. ఇప్పుడు కప్పన్‌, మరొక జర్నలిస్ట్‌ మహ్మద్‌ మనన్‌ దార్‌ విడుదలయ్యారు. గౌతమ్‌ నవ్‌లఖాను గృహనిర్బంధంలో ఉంచారు. మిగిలిన జర్నలిస్టులు ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నారు. వారిలో ఒకరైన ఆసిఫ్‌ సుల్తాన్‌ దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా జైలు జీవితాన్నే అనుభవిస్తున్నారు.
ఇలా ఎందుకు జరుగు తోంది అంటే అది కూడా స్పష్టమే. చట్ట విరుద్ధ కార్య కలపాల నిరోధక చట్టం (ఉపా), జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ), దేశద్రోహం, ప్రజా భద్రతా చట్టం (పిఎస్‌ఏ) వంటి క్రూరమైన చట్టాల వల్ల మాత్రమే జర్నలిస్టులను ఎక్కువ కాలం నిర్బంధించడం సాధ్యమవుతుంది. ఈ చట్టాల ప్రకారం ఒకసారి అభియోగాలు మోపితే, విచారణ ఏండ్ల తరబడి సాగుతున్నప్పుడు బెయిల్‌ పొందడం చాలా కష్టం. అందుకే తమను ప్రశ్నించే పాత్రికేయులపై ఈ క్రూర నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తున్నారు. ఈ కారణంగా వారు సుదీర్ఘకాలం జైలులో గడపవలసి రావడమే కాదు, తమ ఉద్యోగాలనూ కోల్పోవలసి వస్తోంది. అన్నిటికీ మించి ఇది మిగతా పాత్రికేయ సమూహాలను తీవ్రమైన కలవరానికీ, భయబ్రాంతులకూ గురిచేస్తుంది. ఈ భయం జర్నలిజం యొక్క మౌలిక లక్షణాలనే ధ్వంసం చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, నిజం మాట్లాడటమే నేరమనే భయానక పరిస్థితులు సృష్టిస్తే జర్నలిస్టులు కేవలం స్టెనోగ్రాఫర్‌లుగా మారిపోతారని ఈ ఏలినవారి భావన..!
జర్నలిజం నేరంగా పరిగణింపబడుతుందనడానికి కప్పన్‌ ఉదంతమే ఒక ఉదాహరణ. అతనికి దాదాపు రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత, 2022 సెప్టెంబర్‌ 9న ”ప్రతి పౌరునికి భావవ్యక్తీకరణ హక్కు ఉంది” అని పేర్కొంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, 2021లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌చే మోపబడిన మరొక కేసులో అతను జైలులోనే ఉన్నాడు. ఈ కేసులో కూడా అతను డిసెంబర్‌ 2022 చివరలోనే బెయిల్‌ పొందాడు. అయినప్పటికీ ఫిబ్రవరి 2దాకా విడుదల కాలేకపోయాడు. ఇంఫాల్‌కు చెందిన జర్నలిస్ట్‌ కిషోర్‌చంద్ర వాంగ్‌ఖేమ్‌ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అతను సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ యూట్యూబ్‌ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌ సింగ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌లను విమర్శించాడు. ఇంకేముంది దేశద్రోహ నేరం(ఎన్‌ఎస్‌ఎ) కింద అరెస్టయ్యాడు. మణిపూర్‌ హైకోర్టు 2019 ఏప్రిల్‌లో వాంగ్‌ఖేమ్‌ మీద మోపిన అభియోగాలను రద్దు చేసి జైలు నుంచి విడుదల చేసింది. కానీ సెప్టెంబర్‌ 2020లో మణిపూర్‌ పోలీసులు అదే దేశద్రోహ ఆరోపణలపై అతన్ని రెండవసారి అరెస్టు చేశారు. ఇలా చెప్పు కుంటూ పోతే జర్నలిస్టులపై డజన్ల కొద్దీ కేసులను ఉదహరించ వచ్చు. ప్రజా పక్షం వహించే జర్నలిజాన్ని నియంత్రించడానికే ప్రభుత్వాలు ఈ చట్టాలను ఉపయోగిస్తున్నాయని ఇది స్పష్టంగా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ కోసం, నిజమైన జర్నలిజం కోసం పాత్రికేయ సమాజం మాత్రమే కాదు, పౌరసమాజమూ సమాయత్తం కావాలి. అలా చేయడంలో మనం విఫలమైతే, ప్రజాస్వామ్య సౌధం నాలుగోస్తంభం కూలిపోతుంది.

Spread the love