నా దృష్టిలో సినిమా అనేది ఒక అద్భుతమైన ఊహ..

అతడికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం.. పాట అంటే ఊపిరి.. కళ కోసం అహర్నిశలు శ్రమించాడు.. సినిమా తీయాలని, దర్శకుడవ్వాలని పట్టుదలతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు.. తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు.. ‘హిరణ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. గాయకుడిగా ఎన్నో పాటలు పాడి తనకున్న సంగీత తృష్ణను కూడా తీర్చుకున్నాడు.. శ్రీ మురుగా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.. సినీ, సేవారంగాలలో తనదైన పాత్రను పోషిస్తున్న దర్శకుడు ఒమ్మి రామశంకర రావు గారితో ఈ వారం జోష్‌…
– మీ జీవిత నేపథ్యం గురించి చెప్పండి?
హారు.. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో కోసలి-కీసర అనే గ్రామంలో.. నాన్న శ్రీ ఒమ్మి ఆదినారాయణ, అమ్మ శ్రీమతి వేంకటరత్నం, నాన్న మా ఊరిలో పెద్ద రైతు. అలాగే నాటకాలపైన మక్కువ ఎక్కువ. రాజకీయాల పైన కూడా.
నా చిన్నతనంలోనే నాన్నని కోల్పోయాను. ఆయన అనారోగ్యం వలన ఐదుగురు అక్కలు, అన్నయ్య, నేను, అందరి బాధ్యత అమ్మ పైనే.. తాను పస్తులుండి మాకు అన్నం పెట్టిన రోజులెన్నో..ఆర్థికంగా ఇబ్బం దుల్లో ఉన్నప్పుడు మా అన్నయ్య సంతోష్‌ నాయుడు నా కోసం ఆయన చదువు ఆపేసి హైదరాబాద్‌ కి వెళ్ళి రాత్రి పగలు కష్టపడి నాకోసం డబ్బు పంపించేవాడు..అలా నా చిన్నతనం అంతా బాధలమయం.
చదువు అంతా శ్రీకాకుళం లోనే. 8వ తరగతి వరకు ”కడుము గవర్నమెంట్‌ హైస్కూల్‌లో, 10వ తరగతి పెద్దదిమిలి హైస్కూల్‌లో, ఇంటర్‌, డిగ్రీ, శ్రీ వేంకటసాయి డిగ్రీ కాలేజ్‌లో, కొత్తూరు లో2008లో ఒక ఫార్మి కంపెనీలో జాబ్‌ చేస్తూ డిస్టెన్స్‌లో కెమిస్ట్రీలో పీజీ చేశాను.. 2011లో బీపీఓ (విజయవాడలో) కంపెనీలో అసోసియేట్‌గా జాయిన్‌ అయ్యాను..అసిస్టెంట్‌ మేనేజర్‌ వరకు ప్రమోట్‌ అయ్యి 2019లో రిజైన్‌ చేసి ప్రస్తుతం dept of Skill developmentలో చేస్తూ సినీ మరియు సేవారంగాల పైన మక్కువతో మీ ముందుకు ఇలా..
– సినిమాలపై మీకు ఆసక్తి ఎలా కలిగింది?
మా ముత్తాత శ్రీ ఒమ్మి దాసునాయుడు గజపతినగరం రాజుల ఆస్థానంలో కవిగా ఉండేవారట.. అదే విధంగా నాటకాల మీద మక్కువ ఎక్కువ..ఆ తరువాత మా తాత శ్రీ ఒమ్మి లక్ష్మీ నారాయణ నాయుడు, మా నాన్న ఒమ్మి ఆదినారాయణ నాయుడు ఆ కళా వారసత్వాన్ని కొనసాగించారు.. ఆ విధంగా నాటకాలపైన ఇంట్రెస్ట్‌ కలిగింది.. అదే విధంగా చిన్నప్పటి నుండి సినిమాలు ఎక్కువగా చూడటం, పాటలు కూడా బాగా పాడుతుండడంతో ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌ తో సినిమాలలో పాడాలి అనే కోరిక కలిగింది..అయితే 2011లో సారథి స్టూడియోలో లో ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించే పాటల ప్రోగ్రామ్‌ ఆడిషన్స్‌కి వెళ్ళా..అక్కడ అప్పటికే రికమండేషన్‌ పర్వం స్టార్ట్‌ అయింది..ఆరోజు ఉదయం నుండి వెయిట్‌ చేస్తున్న మాలో కొందరు మంచి సింగర్‌ ఉన్నారు. కాని ఛాన్స్‌ లేదు అని రికమండేషన్‌ పర్సన్స్‌కి ఛాన్స్‌ ఇచ్చారు..అది తప్పు కదా అని అడిగినందుకు సెక్యూరిటీ తో బయటకు గెంటించారు నన్ను,నా ప్రెండ్స్‌ని.. అప్పుడు డిసైడ్‌ అయ్యాను..సినిమా తీయాలి న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యాలి అని.. హిరణ్య స్టార్ట్‌ చేసి న్యూ టాలెంట్‌ ని గుర్తించి తీసుకోవటం జరిగింది…
– మీ సినిమా ప్రస్థానం గురించి వివరించండి?
2011 లో సారథి స్టూడియోలో జరిగిన ఇన్సిడెంట్‌ తో సినిమా తీయాలి అని అనుకున్నా కూడా నాకున్న బాధ్యతల (ఉద్యోగం, కుటుంబం) వలన అన్నీటికి దూరంగా ఉన్నాను.. 2016లో దురాలవాట్లకు బానిసలై జీవితాలని కోల్పోతున్న యువత కోసం ఏదైనా చెయ్యాలి అని ‘స్వరం’ అని ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశా..
ఆ తరువాత 2019లో నా ఫ్రెండ్స్‌ , నేను కలిసి మిస్టర్‌ మంచోడు అనే మూవీ తీశాము..అది పోస్ట్‌ ప్రొడక్షన్‌లో జాప్యంవలన రిలీజ్‌ని ఆపాము.. ఈగ్యాప్‌ లో హిరణ్య స్టార్ట్‌ చేశాము.. ఇప్పుడు  Mr.మంచోడు కంటే హిరణ్య ముందు రిలీజ్‌ అవ్వ బోతోంది.. హిరణ్య తరువాత మరో రెండు ప్రాజెక్ట్స్‌ కూడా రెడీగా వున్నాయి..త్వరలో వివరాలు వెల్లడిస్తా..

– ఒక దర్శకునిగా మీకు ఎలాంటి సినిమాలు తీయాలనే సంకల్పం ఉంది?
సామాజిక అంశాలు ఉండే సినిమాలు చెయ్యాలి.. ముఖ్యంగా అనాథలు, వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధుల సంఖ్య రోజు రోజుకి పెరుగు తోంది.. దానిపై సమాజంలో కొందరిని ప్రశ్నించాలి అనేది నా కోరిక.
– మీరు చేసిన సామాజిక సేవాకార్యక్రమాలు గురించి చెప్తారా?
మా నాన్న చనిపోయాక మాకు అన్నం పెట్టి, అమ్మ పస్తులున్న రోజులు చాలా చూశా.. నా చదువు కోసం అన్నయ్య ఆయన చదువుని ఆపేసి హైదరాబాద్‌లో డే అండ్‌ నైట్‌ కష్టపడి నా కోసం డబ్బులు పంపించేవాడు.. ఒక రోజు అన్నయ్య ఫ్రెండ్స్‌ కాల్‌ చేసి, అరె నీ చదువు కోసం మనీ ఎక్కువ కావాలి అని, వాడి ఎంజారుమెంట్స్‌ అన్నీ ఆపుకుని, కొన్నిసార్లు ఆకలితో కూడా పస్తులుంటూ కష్టపడుతూ ఉంటాడు.. బాగా చదువుకో అని చెప్పారు. మా పూర్వీకులు దానధర్మాలు ఎక్కువగా చేసేవారని అందరూ చెప్తుంటే వినేవాడిని. పరిస్థితులన్నీ మారాక మా అమ్మ ఒక మాట చెప్పింది. మనం సంపాదించిన దానిలో మనకు కావలసినంత తీసు కుని మిగిలిన దానితో ఒక్కరి ఆకలి అయినా తీర్చు చిన్నోడ అని..2020లో కోవిడ్‌ మొదటి రోజు నుండి శ్రీ మురుగా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించి రోజుకి 250-300 మందికి ఆహారం అందించటం జరిగింది.. ఇప్పటికీ జరుగుతూ ఉంది.. అన్న దానంతో పాటు ఉచిత ఉద్యోగ కల్పన కార్యక్రమం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి, వికలాంగులకు, వృద్ధులకు వీల్‌ చైర్స్‌, ట్రై సైకిల్స్‌ లాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతూ ఉన్నాయి. నా ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటాయి…

ఈ కార్యక్రమాలు నా ఒక్కడితోనే సాధ్యమని నేను చెప్పుకోను. మేము సైతం అని ఎందరో వారి వారి సహకారాన్ని అందించారు. అందిస్తూనే ఉన్నారు. వారికి రుణపడి ఉంటా..
– మీరు పొందిన అవార్డుల గురించి, సత్కారాల గురించి చెప్తారా?
కాలేజ్‌ లెవెల్‌ లో జిల్లా స్థాయి పాటల పోటీల్లో 2సార్లు బెస్ట్‌ సింగర్‌గా అవార్డులు వచ్చాయి.. జాతీయస్థాయి కళా సంస్థల ద్వారా కొన్ని ప్రశంసలు మరియు ట్రస్ట్‌ సేవలకుగాను కొన్ని అవార్డులు పురస్కారాలు కూడా ఇచ్చారు. కానీ పొగడ్తలకు దూరంగా ఉంటా..అది అహాన్ని పెంచుతుంది అనేది నా భయం..
– ‘సినిమా’ అనే పదాన్ని ఒక్క మాటలో నిర్వచిం చవలసి వస్తే మీరేం చెబుతారు?
ఒక అందమైన అబద్ధం. అద్భుతమైన ఊహ..
– చివరగా హిరణ్య గురించి?
హిరణ్య ఒక మంచి ఫీల్‌ ఉన్న క్రైమ్‌ థ్రిల్లర్‌. సామాజిక అంశంతో కూడిన అందమైన కథ.. ఈ రోజుల్లో సమాజంలో ధనానికి ఉన్న విలువ బంధాలకు లేదు..అది తెలియ జెప్పటానికి చేసిన ప్రయత్నమే హిరణ్య.. హీరో మార్తి చంద్రమౌలి (చిన్ని), విలన్‌గా వశిష్ఠ శృంగారం, పెద్దిరాజుల నటన ఆద్యంతం మెప్పిస్తుంది. హిరణ్య పాత్ర మేజర్‌ హైలెట్‌… ఈ సినిమాలోని పాటలకు తిరునగరి శరత్‌ చంద్ర, జాహ్నవి గారు మంచి సాహిత్యాన్ని అందించారు, నేను కూడా ఒక పాట రాశాను.. సంగీతం ఎ.వి.రమణ గారు అద్భుతమైన బాణీలు సమకూర్చారు..BGM అయితే మాటల్లో చెప్పలేను.. ముఖ్యంగా నా DOP  ఎం. సాయిరాం క్రిష్ణ గురించి చెప్పాలి.. అద్భుతమైన కెమెరా పనితనం.. ప్రతీ ఫ్రేమ్‌ ఫ్రెష్‌గా చిత్రీకరిం చారు..ఫైట్‌ మాష్టర్‌ రామరాజు (జోసెఫ్‌), ప్రసాద్‌, కో డైరెక్టర్‌ సంజరు కె.వి.సి, సింగర్స్‌ హేమలతా దేవి,రేష్మీ గౌతమి, ఎస్‌కే ఆభీదా, రూప సత్య శ్రీ, ప్రతీ ఒక్కరు సహకరించారు.. ఇక నాకు ప్రత్యక్షంగా సహకరించిన వేదా కన్సల్టెన్సీ అధినేత పి.పూర్ణానంద్‌ అన్నయ్య, యువన్‌ రికార్డింగ్‌ స్టూడియో అధినేత ఉమామహేష్‌ అన్నయ్య ల సహకారం మరువలేనది.
– చివరిగా..
ఇది నా సినిమా కాదండి..ప్రతి తెలుగు ప్రేక్షక దేవుడి సినిమా..మీ ఇంటిలో ఒక సభ్యుడి సినిమా అనుకుని మన హిరణ్య ని ఆదరిస్తారని కోరుతున్నాను..

– జోష్‌ టీం

Spread the love