నీ స్మరణే ఓ ప్రేరణ

‘హయత్‌ లేకె చలో కాయనాత్‌ లేకే చలో
చలో తో సారే జమానేకో సాథ్‌లేకె చలో…’
బతుకు వెంటబెట్టుకు నడుద్దాం, లోకాన్ని వెంట బెట్టుకు నడుద్దాం! మనం నడిస్తే కాలాన్ని వెంటబెట్టుకు నడుద్దాం!
ముందుకు… ముందుకు నడవాలి… లోకాన్ని, కాలాన్ని, కలాన్ని ఎగురే ఎర్రని పతాకాన్ని వెంట బెట్టుకుని గీతంలా ప్రవహించిన మహౌన్నతుడు మఖ్ధూం మొయినుద్దీన్‌. ఆయనను స్మరించుకుని గుండెనిండా చైతన్యాన్ని నింపుకుని మనమూ నడవాల్సిన అవసరముంది. అతనొక వ్యక్తికాదు. నిరంతరం జ్వలించే విప్లవశక్తి. అతను సాయుధ పోరాట యోధుడు. కార్మిక నాయకుడు. కమ్యూనిస్టు నాయకుడు. ప్రజాప్రతినిధి. కవి, కథారచయిత, వ్యాసకర్త, నాటక రచయిత, సాహిత్య విమర్శకుడు. గజల్‌ కవి, శ్రామికుడు, ప్రేమికుడు. హైదరాబాదు నగర చరిత్ర శిల్పం మెడలో అరుణారుణమై మెరుస్తున్న మోదుగుపూల హారం మఖ్ధూం. ఆయనను తలచుకుంటే ఉత్తేజం ఉప్పొంగుతుంది. నేటి మతోన్మాద తిరోమన తిమిర పథగమనంపై నిప్పులు చెరుగుతుంది. అందుకే ఆయన స్మరణలోంచి కొత్త ఖడ్గాన్ని ఎత్తిపట్టుకోవాలి.
ప్రపంచాన ఇటలీలో ముసోలినీ, జర్మనీలో హిట్లర్‌లతో ఫాసిస్టు ధోరణులు ప్రబలుతున్న కాలంలో మఖ్ధూం విప్లవ రాజకీయ జీవితం ఆరంభమయింది. ఆనాటి సోవియట్‌ ఎర్ర సైన్యం ఫాసిజాన్ని తరిమికొట్టినప్పటికీ నేడు మరో వికృతరూపంలో ప్రజల మీద దాడి చేస్తున్నది. మన దేశంలో ఫాసిస్టు తరహా ఆలోచనలు ఆచరణా విస్తరిస్తున్న సందర్భాన మఖ్ధూం కార్యాచరణ మనకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. 1936లోనే కమ్యూనిస్టుగా మారిన ఆయన 1939లో విద్యార్థి సంఘాన్ని స్థాపించి ప్రజాపోరాటాలను నిర్మించాడు. 1940లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపనతో నాయకుడిగా అడుగులు వేసాడు. ఆ క్రమంలోనే ఫాసిస్టు శక్తులు, నాజీలు సోవియట్‌ మీద దాడి చేయటంతో ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికై హైదరాబాద్‌లో సభను నిర్వహిం చాడు మఖ్ధూం. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో యోధుడుగా పీడితుల పక్షాన నిలబడి ముందుకు నడిచాడు.
1908 ఫిబ్రవరి 4న జన్మించిన మఖ్ధూంది పేద కుటుంబం. ఐదేండ్ల వయస్సులోనే తండ్రి మరణించగా, పినతండ్రి సంరక్షణలో పెరిగాడు. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తితో అధ్యయనం కొనసాగించాడు. హైదరాబాద్‌ సిటీ కాలేజీలో రెండేండ్లు అధ్యాపకుడుగా పనిచేసి కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఉద్యమంలోకి వచ్చి చేరాడు. జాతీయ స్థాయిలో గొప్ప కవిగా, రచయితగా పేరుగాంచాడు. అయినా ఉద్యమంలో నిబద్దుడుగా పనిచేశాడు. జైళ్లకెల్లాడు. కార్మికోద్యమంలో పని చేశాడు. రాచరిక నిరంకుశత్వాన్ని ఎదిరించి సాయుధుడై పోరాడాడు. కవితా ప్రేమికుడు, ప్రజా ప్రేమికుడు కావుననే విప్లవ ప్రేమికుడై ప్రజా హృదయాలను చూరగొన్నాడు. ప్రజల కోసమే తన జీవితాన్నంతా వెచ్చించాడు. అశేష ప్రజల బాధలను తన కవనంలో, పాటలో ప్రతిధ్వనించి వారి కోసమే విప్లవ పథాన పయనించిన స్ఫూర్తిమయ జీవితం మఖ్ధూంది.
‘గుడి మాటున మత మౌఢ్యపు గోపురాలు నిలిచెనే…
తలల్లోన ఆధ్యాత్మిక రాజ్యం నర్తించెనే…
మాయా భ్రమజ్వాలల్లో మనిషి బానిసయ్యెనే
పద పదవే గీతమా! పదవే నా ప్రాణమా!
మస్తిష్కంలోన జనం మత్తు మందు నిండెనే
కార్మిక రక్తపు స్రవంతి కట్టలు తెగి పారెనే..
న్యాయ సుగంధనిలాలు నింపుము ఈలోకంలో
బ్రతుకును నడిపించునట్టి పాటలు చెరజిక్కెనే…
చుక్కలాంటి చెలిగళాన సితబల్లెం నాటెనే…
పంజరాన పక్షులుగా బ్రతికిరి నీ సహచరులే…
ఈ లోకం నీ కోసం ఎంత పరితపించెనో…
ఈ ధరిత్రి నీరాకకు ఎంత నిరీక్షించెనో…
తోరణాలు తీర్చి జనం దారుల్లో నిలిచిరే…
పద పదవే గీతమా’
అని పాడుకున్న మఖ్ధూం ఆనాటి గీతం నేటి మన స్థితికీ అద్దం పడుతోంది. గీతాలను, గళాలను చెరసాలలో బంధిస్తున్న సమయాన మఖ్ధూం పాటను మళ్ళీ మనం ఎత్తుకోవాల్సిందే. తెలంగాణ నీల వీరులగన్న వేల ధీరుల రక్తంతో పదునెక్కిన నేల. జన విముక్తికోసం కుల మతాల కతీతంగా స్వరమెత్తిన నేల. అందుకే… ‘చెక్కు చెదరనీ సంకల్పాలకు వందల సలాములు, అమర వీరులను కన్నతల్లికి సహస్ర సలాములు’ అని ఈ నేలకు సలాములు పాడాడు ఆయన. ముంచుకొస్తున్న ముప్పును గమనించకపోతే తీవ్ర నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ”ఇప్పుడు లోకంలో భయంకరమైన సుడిగాలులు రానున్నాయి. ఇక పూలేమిటీ పూదోటే ఎగిరిపోనుంది” అన్న మఖ్ధూం హెచ్చరిక ఇప్పుడు మనకోసమే చెప్పినట్టు అనిపించడం లేదూ! ఆయన స్మరణలో సమాయత్త మవుదాం రండి!
(నేడు మఖ్ధూం మొయినొద్దీన్‌ జయంతి)

– కె. ఆనందాచారి

Spread the love