నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌

– ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక సర్వే
– రేపు నిర్మలమ్మ పద్దు
– అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ గైర్హాజరు

– అదానీ వల్ల ఎల్‌ఐసీకి జరిగిన నష్టాన్ని లేవనెత్తిన ప్రతిపక్షం
ప్రతి అంశంపై చర్చకు సిద్ధం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

న్యూఢిల్లీ : నేటీ (మంగళవారం) నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. అఖిలపక్ష సమావేశంలో అదానీ కంపెనీ వల్ల ఎల్‌ఐసీకి జరిగిన నష్టాన్ని, చైనా అంశాన్ని, బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం, కుల ఆధారిత జన గణనకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో నిబంధనల ప్రకారం ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల మద్దతును కోరుతున్నామని ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ జోషి, పియూష్‌ గోయల్‌, అర్జున్‌ రామ్‌ మేఫ్‌ు వాల్‌, వి.మురళీధరన్‌, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, సుఖేందు శేఖర్‌ రారు, సీపీఐ(ఎం) నేతలు ఎలమారం కరీం, పిఆర్‌ నటరాజన్‌, డీఎంకే నేత టిఆర్‌ బాలు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, వైసీపీ నేత వి.విజయసాయి రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఆర్‌జేడీ నేత మనోజ్‌ ఝా, ఆప్‌ నేత సంజరు సింగ్‌, జేడీయూ నేత రామ్‌ నాథ్‌ ఠాకూర్‌, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో 27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌ రాజ్యసభ, లోక్‌సభ నేతలు జమ్మూ కాశ్మీర్‌లో భారత్‌ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఉండటంతో సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.
సమావేశ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పార్లమెంట్‌లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కోరుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నేత ఎలమారం కరీం, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజరు సింగ్‌, ఆర్జేడి నేత మనోజ్‌ కుమార్‌ ఝా, డీఎంకే ఎంపి టిఆర్‌ బాలు తదితరులు అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికలో ఉన్న అదానీ గ్రూప్‌ స్టాక్‌ మానిప్యులేషన్‌ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్‌లో దానిపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన ఆర్థిక గణన చేపట్టాలని జేడీయూ, ఆర్‌జేడీ వంటి పార్టీలతో కలిసి వైసీపీ డిమాండ్‌ చేసింది. మహిళ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని సీపీఐ(ఎం), టీఆర్‌ఎస్‌, టీఎంసీ, బీజేడీ సహా ఇతర పార్టీలు డిమాండ్‌ చేశాయి. సామాజిక, అభివృద్ధి సూచికల్లో వెనుకబడిన కులాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ పేర్కొంది. మొత్తం జనాభాలో వెనుకబడిన కులాల జనాభా 50 శాతానికి పైగా ఉన్నాయనీ, వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జనాభా గణన దోహదపడుతుందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా కోటా బిల్లును కూడా ఆమోదించాలని తమ పార్టీ డిమాండ్‌ చేసిందని విజయసాయి రెడ్డి అన్నారు.
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో లోక్‌సభ, రాజ్యసభల ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు (నేడే) ఆర్థిక సర్వేను కూడా ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న (బుధవారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గురువారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. బడ్జెట్‌ సెషన్‌ మొదటి భాగం ఫిబ్రవరి 13న ముగుస్తుంది. డిపార్ట్‌మెంట్‌ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలు గ్రాంట్స్‌ కోసం డిమాండ్‌లను పరిశీలించడానికి, మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నివేదికలను రూపొందించడానికి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు దీనికి విరామం ఉంటుంది. బడ్జెట్‌ సెషన్‌ రెండో భాగం కోసం పార్లమెంట్‌ మార్చి 13న తిరిగి సమావేశమవుతుంది. బడ్జెట్‌ పత్రాలను పరిశీలించడానికి నెల రోజుల విరామంతో ఏప్రిల్‌ 6 వరకు కొనసాగుతుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నిర్ణయించింది.

Spread the love