నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించబోయే బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడ మీడియా సమావేశంలో సీఎం పాల్గొంటారు. బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా నాందేడ్‌లో సీఎం సభను నిర్వహిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన పలువురు ముఖ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరనున్నారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గత వారం రోజులుగా నాందేడ్‌లోనే మకాం వేశారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆయనతోపాటు ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్ తదితరులు ఏర్పాట్లలో నిమగమయ్యారు.
పలువురు నేతల భేటి…
వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్లు శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్ బాలాఘాట్‌కు చెందిన మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్‌ఘడ్ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ పసుల సమ్మయ్య పోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. బీఆర్ఎస్ విధానాల పట్ల ఆకర్షితులైన తాము ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.