రాష్ట్రాల రాజకీయాలతో గవర్నర్లకు పనేమిటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నిస్తున్న సందర్భంగానే నరేంద్రమోడీ ప్రభుత్వం ద్విముఖ రాజకీయానికి పాల్పడింది. ఏకకాలంలో రెండు వ్యవస్థలతో రాజకీయ క్రీడ సాగించింది. ఆంధ్రపదేశ్‌తో సహా పన్నెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారడానికి కారణం ఇదే. ఇందులో సగం మందిని ప్రస్తుతమున్న చోట్ల నుంచి కొత్త చోట్లకు మార్చగా, మరో ఆరుగురిని నూతనంగా నియమించారు. వీరిలో చాలామంది బీజేపీ నేతలు, ఒకరు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్. పాలక పార్టీల నేతలకు పునరావాస కేంద్రాలుగా రాజ్భవన్లను ఉపయోగించే రివాజు గతం నుంచి ఉంది గనుక ఎవరూ ఆశ్చర్యపోరు. అనుభవజ్ఞులైన మాజీ ముఖ్యమంత్రులూ, మంత్రులూ సీనియర్ నేతలతో పాటు మాజీ బ్యూరోక్రాట్లను కూడా గవర్నర్లుగా నియమించడం గతంలో జరిగేది. కాంగ్రెస్ హయాంలోనూ చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి మాజీ ముఖ్యమంత్రులను కూడా గవర్నర్లను చేశారు. గవర్నర్లు సిఎంలుగానూ మారారు. ఉదాహరణకు మహారాష్ట్ర నాయకుడు సుశీల్ కుమార్ షిండే, యూపీ నేత నారాయణ్‌దత్ తివారి వంటివారు ఉమ్మడి ఏపీకీ గవర్నర్లుగా పనిచేశారు. కాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక వీటిని మార్చేశారు. ఉదాహరణకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. సంఫ్‌ు పరివార్ పెద్దలను నియమించడం వాజ్‌పేయి హయాంలోనూ జరిగింది గాని ఇప్పుడు మరింత పెరిగింది. వారు ఆయా బీజేపీయేతర రాష్ట్రాల వ్యవహారాలలో తలదూర్చడం, ఇబ్బంది పెట్టడం కూడా ఆ మేరకు పెరిగింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక వంటిచోట్ల గవర్నర్ల నిర్వాకాలు, నిరోధకాలు నిరసనలకు దారితీశాయని చాలాసార్లు చెప్పుకున్నదే. ఈ సమయంలో కూడా పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి మాన్‌పై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ బిఎస్ రవి రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని బాహాటంటా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ గతంలో బెంగాల్ గవర్నర్‌గా ఉండి పాలన తీరుపై నిత్యం వ్యాఖ్యలు చేసేవారు.
రాజ్భవన్లలో న్యాయమూర్తులు
ఈతరహా ఉల్లంఘనలన్నిటిలోకీ దారుణమైంది మాజీ న్యాయమూర్తులనూ ప్రధాన న్యాయమూర్తులనూ కూడా గవర్నర్లుగా నియమించడం. వాస్తవానికి జడ్జిలుగా నియమించేముందు వారిగురించి ప్రత్యేక నిఘా నివేదికలు తెప్పించుకుంటారు. కాస్త వివాదం ఉందన్నా నియామకం నిలిపేస్తారు. మోడీ ప్రభుత్వం వచ్చాక తమకు నచ్చని వారిని కొలీజియం సిఫార్సు చేస్తే నియమించకుండా నిలిపేస్తున్నారు. కొలీజియం నిర్ణయాల పారదర్శకత ఉండటం లేదని కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్ రిజీజు పదేపదే దాడిచేస్తున్నారు. జడ్జిల నియామకంలో జోక్యం కోసం ఒక అఫిడవిట్ కూడా కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఇటీవలనే ఒక న్యాయమూర్తిని స్వలింగ సంపర్కుడన్న కారణంతో నిలిపేసింది. ఇదంతా కూడా న్యాయమూర్తులుగా వచ్చేవారి సచ్చీలత కోసమేనని చెబుతున్నారు. న్యాయ మూర్తుల నియామకంపై చర్చ మరోసారి చేయొచ్చు. కానీ అంతగా చెప్పే సచ్చీలత పదవీ విరమణ తర్వాత అక్కర్లేదా? పదవీ విరమణ తర్వాత మరింత కీలకమైన పదవులు ఎరజూపితే ఇక విలువలమయ్యేట్లు? జైభీమ్ సినిమాతో దేశమంతటినీ ఆకర్షించిన జస్టిస్ చందు తను పదవీ విరమణ తర్వాత ఏ విధమైన కమిషన్ల చైర్మన్ గిరీ కానీ, రాజ్యసభ సభ్యత్వం గానీ, గవర్నర్ గిరీ గానీ తీసుకోబోనని ముందే ప్రకటించారు. యూపీఏ హయాంలో వచ్చిన పదవుల ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించారు. మాజీ సిజెఐ రంజన్ గోగోరు పుస్తకానికి ముందు మాట రాయడానికీ, ఆవిష్కరణకూ కూడా నిరాకరించారు. న్యాయమూర్తులు గనక రాజకీయ పదవులకు ఎన్నికైన నేతలకు పుష్కగుచ్ఛాలు, అభినందన సందేశాలు పంపించడం మొదలెడితే వారిపై ప్రజల విశ్వాసం సన్నగిల్లిపోతుందని జస్టిస్ తుల్జాపుర్కార్ 1980లో వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? మాజీ న్యాయమూర్తి అరుణ్‌మిశ్రా ప్రధాని మోడీ భజన చేయడం బహిరంగ విమర్శలకు గురవడం గుర్తుండేవుంటుంది. ఆయన హయాంలోనే అదానీ అక్రమాలను బయిటపెట్టిన పాత్రికేయులు పరంజరుగుహ ఠాగూర్ లపై మూడు పరువు నష్టం దావాలు రావడం, వారిని రాయకుండా ఆంక్షలు విధించడం మర్చిపోకూడని విషయం.
మోడీ రాజ్యంలో పరాకాష్ట
కాంగ్రెస్ హయాంలోనూ అనేక అవకతవకలు జరక్కపోలేదు. ఇందిరాగాంధీ సీనియారిటీని ఉల్లంఘించి ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక చేసిన ఉదంతాలున్నాయి. అత్యవసర పరిస్థితిలో ఆమె నిబద్ద న్యాయవ్యవస్థ (కమిటెడ్ జ్యుడిషయరీ కావాలని అంటుండేవారు. ఆ పార్టీ హయాంలో మాజీ న్యాయమూర్తులను అనేక న్యాయసంబంధమైన పదవుల్లో నియమించేవారు. 1952లో నెహ్రూ హయాంలో జస్టిస్ ఫజల్ ఎస్ అలీని ఒరిస్సా గవర్నర్‌గా నియమించారు. మళ్లీ దేవగౌడ ప్రభుత్వం జస్టిస్ ఫాతిమాబీవీని పదవీ విరమణ తర్వాత అయిదేండ్లకు తమిళనాడు గవర్నర్‌గా పంపించింది. నరేంద్రమోడీ అధికారం చేపట్టగానే కేరళకు మాజీ సిజెఐ పి.సదాశివన్‌ను గవర్నర్‌గా పంపించారు. ఆయన హయాంలో అనేక సమస్యలు రాగా తర్వాత వచ్చిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత తీవ్రమైన సంక్షోబాలు సృష్టిస్తూనే ఉన్నారు. నూతన గవర్నర్ల నియామకాలు కొత్త వివాదానికి కారణమైనాయి. ఏపీ గవర్నరుగా వచ్చిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అనేక కీలక కేసుల్లో ఇచ్చిన తీర్పులు మోడీ సర్కారుకు ఎంతో సంతోషం కలిగించడమే ఇందుకు కారణం. వాటిలో అయోధ్య రామమందిరం తీర్పు కీలకమైంది గాని మిగిలినవి కూడా తక్కువ ప్రాధాన్యత గలవికావు. పెద్దనోట్ల రద్దు కేసులో ప్రభుత్వం చేసిందాట్లో తప్పు లేదన్న తీర్పు, విద్వేష ప్రసంగాల వివాదంలో ఇష్టానుసారం మాట్లాడకుండా కట్టడి చేయలేమన్న తీర్పు, కాశ్మీర్ 370వ అధికరణం రద్దు చెల్లుతుందన్నతీర్పు అన్నీ బీజేపీకి ఎంతో ఉత్సాహమిచ్చాయి. ఈ ధర్మాసనాలన్నిటిలోనూ జస్టిస్ నజీర్ భాగస్వామి. ముస్లిం అయినప్పటికీ రామాలయానికి అనుకూలంగా తీర్పు నివ్వడం ఆయన లౌకికస్ఫూర్తికి నిదర్శనమని పెద్దఎత్తున ప్రచారం నడిచింది. ఎవరిమతం ఏమిటన్న మీమాంస కంటే ఎవరు రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కాపాడేవిధంగా వ్యవహరించా రన్నది ఇక్కడ ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. ఈ తీర్పుపై అనేక భిన్నాభిప్రాయాలు రావడమే గాకుండా సుప్రీం కోర్టులో సవాలు చేయడం గమనించదగింది. ఏమైనా ఈ తీర్పుతర్వాత ఆ ధర్మాసనంలో సభ్యులైన న్యాయమూర్తులందరినీ పదవులు వెతుక్కుంటూ రావడం యాదృచ్చికం కాదు. ముందుగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోరు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీనిపై విమర్శలు ఎన్ని వచ్చినా ఆయన బేఖాతర్ చేశారు. ఇటీవలనే ఆయన పనితీరు ఆరాతీస్తే అతి తక్కువగా పార్లమెంటుకు హాజరులోనూ, చర్చలలోనూ ప్రయివేటు బిల్లులు ప్రతిపాదించడంలోనూ బాగా వెనకబడి ఉన్నారు. అందులోని మరో న్యాయమూర్తి అశోక్ భూషణ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) చైర్మన్‌గా నియమితు లయ్యారు. ఇది కంపెనీల వ్యవహారాలపై తీర్పులిచ్చే అతి కీలక సంస్థ. ఈ కోవలో ఇప్పుడు జస్టిస్ నజీర్ నియామకం మూడవది.
జస్టిస్ నజీర్ నేపథ్యం
ఏపీ గవర్నరుగా వచ్చిన జస్టిస్ నజీర్ కేవలం ఆ తీర్పు ఇవ్వడమే కాదు. బీజేపీకి అనుకూలమైన లాయర్ల సంస్థ అఖిలభారత అభివక్త పరిషత్(ఎబిఎపి)లో సభ్యులుగా ఉన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ… భారతీయ న్యాయ వ్యవస్థ మనుస్మృతిని ఎప్పుడూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. సంఫ్‌ు పరివార్‌కూ మనుధర్మానికి ఉన్న అనుబంధం మనువుతో పాటు కౌటిల్య, కాత్యాయన, బృహస్పతి, నారద, యాజ్ఞావల్క్య వంటి ప్రాచీన పండితుల వారసత్వం కూడా కలుపుకుని మన న్యాయవ్యవస్థను భారతీయం చేయాలని అభిలషించారు! భారతీయ సమాజంలో దొంతరలను నిర్దేశించే నాటి భాష్యాలు ఈ న్యాయమూర్తికి నచ్చడమేమిటి? అయితే ఈయన చాలా నిరాడంబరుడనీ మతాతీతంగా తీర్పునిచ్చాడనీ సిజెఐ చంద్రచూడ్ కూడా కొనియాడటం విశేషం. గతంలో మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం గురించీ ఆయన లౌకికతత్వం గురించీ ఇలాంటి కబుర్లే వినేవాళ్లం. వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉంటారనేది ఒకటైతే, ఎవరివైపు ఉంటారు, ఏ విలువలవైపు ఉంటారు, ఏ వృత్తిలో ఉన్నారనేది కూడా కీలకం. ఆ విధంగా చూస్తే అబ్దుల్ నజీర్ కూడా సంఫ్‌ు పరివార్‌కు ప్రీతిపాత్రులైన వ్యక్తిగనకే ఇలాటి తీర్పులు ఇవ్వడం, ఈ పదవులు పొందడం సాధ్యమైందన్నమాట. ఆయనతో పాటు నియమితులైన మరో నలుగురు గవర్నర్లు లక్ష్మి ప్రసాద్ ఆచార్య(సిక్కిం) సిపి రాధాకృష్ణన్(జార్ఖండ్) శివప్రతాప్ శుక్లా (హిమచల్ ప్రదేశ్) గులాబ్ చంద్ కతారియా (అస్సాం) కూడా సంఫ్‌ు నేపథ్యం గలవారే. ఆ మాటకొస్తే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయిన విశ్వభూషణ్ హరిచందన్ అచ్చంగా అదే తరహాలో వారే! గవర్నర్ల అనుచిత ప్రవర్తనలు అప్రజాస్వామిక రాజ్యాంగ విరుద్ధపోకడలకు కారణాలేమిటో దీన్నిబట్టే తెలుస్తోంది. గతంలో ఇందుకోసం కాంగ్రెస్‌ను తిట్టిపోసిన బీజేపీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు అంతకంటే దారుణం. తమాషా ఏమంటే మాజీ న్యాయమూర్తుల నియామకాలు పెరిగిన కొద్ది మాజీ బ్యూరోక్రాట్ల నియామకాలు తగ్గిపోవడం!
కిం కర్తవ్యం?
ఈ పరిస్థితి మారాలంటే ముందు కేంద్రం దృష్టికోణం మారాలి. సర్కారియా సిఫార్సుల ప్రకారం గవర్నర్ల నియామకంపై ముందుగా రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయిం చాలి. వారి ముందు ముగ్గురి జాబితా ఉంచి ఎంచుకోవడానికి అవకాశమివ్వాలి. తాజాగా పదవులు నిర్వహించిన వారినీ అప్పుడే రాజకీయ పదవుల నుంచి వచ్చిన వారిని దూరం పెట్టాలి. వివాదాస్పద నేపథ్యం ఉంటే అసలు పరిశీలనకే తీసుకోకూడదు. ఇక న్యాయమూర్తుల వరకూ బాధ్యతల విరమణ తర్వాత రెండేండ్ల విరామం లేకుండా పదవులు ఆమోదించకూడదు. ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సభలో దీనిపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. న్యాయవ్యవస్థపై పాలకుల ఒత్తిడి ఒక సవాలైతే వారి ప్రలోభాలను తోసిపుచ్చే నైతికత నిలబెట్టుకోవాలి. అది లోపిస్తున్నందునే సిజెఐ చంద్రచూడ్ న్యాయవ్యవస్థకు అతిపెద్దముప్పు అంతర్గతంగానే ఉత్పన్నమవుతుందని హెచ్చరించాల్సి వచ్చింది. జస్టిస్నజీర్ నియామకం దాన్ని మరోసారి గుర్తు చేస్తున్నది.
తెలకపల్లి రవి