న్యాయ వ్యవస్థను బెదిరించడం ఆపండి : ఐలు

న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను ప్రభుత్వం బెదిరించ టాన్ని ఆపాలని అఖిల భారత న్యాయవాదుల యూనియన్‌ (ఏఐఎల్‌యూ) ఐలు కోరింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవల పరోక్షంగా చేసిన బెదిరింపును కూడా విమర్శించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఫైళ్ళను పెండింగ్‌లో పెట్టుకుని కూర్చొంటున్నదని అనొద్దంటూ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా రిజిజు ఇటీవల చేసిన ప్రకటనను ఐలు ప్రస్తావించింది. నిరంకుశవాదానికి, ఫాసిజానికి వెసులుబాటు కల్పించేందుకు న్యాయ వ్యవస్థను మచ్చిక చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇవని ఐలు విమర్శించింది. ప్రజాస్వామ్యమనేది క్రమం తప్పక జరిగే ఎన్నికల కన్నా, చట్టసభల ఆధిక్యత కన్నా ఎక్కువని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ ధర్మాసనాలకు న్యాయపరమైన సమీక్షల అధికారమనేది మన రాజ్యాంగానికి మౌలిక పునాది వంటిదని పేర్కొంది.

Spread the love