పండుగ వేళ కాస్త కొత్తగా…

పండుగల సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకుంటారు అందరూ. ఈ సమయంలో గృహాలంకరణలో కొన్ని మార్పులు చేసి చూడండి. ఇల్లంతా కొత్తగా కనిపించడమే కాదు, పండగ కళ ఉట్టిపడుతుంది. ఇందులో నిపుణులు చెప్పే చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
గదుల్లోని కార్పెట్లు, సోఫా కవరు, డైనింగ్‌ టేబుల్‌, కుర్చీల కవర్లు అన్నీ ఒకే రకమైన వర్ణం, డిజైన్లను మ్యాచింగ్‌గా వేస్తుంటాం. అయితే ఈసారి కొంచెం మార్చి చూడండి. సోఫా కవర్‌కు భిన్నంగా కుషన్స్‌ కొన్నింటికి స్ట్రైప్స్‌, మరికొన్నింటికి పూల డిజైన్ల కవర్లను ఎంపిక చేయాలి. అలాగే డైనింగ్‌ టేబుల్‌పై వేసే క్లాత్‌ డిజైన్‌కు భిన్నంగా కుర్చీల కవర్లపై పూల ప్రింటు ఉంటే మంచిది. వీటన్నింటితో సంబంధం లేకుండా కార్పెట్‌ డిజైన్‌ ఉండేలా మార్చి చూడండి. గోడలకు పూల ప్రింట్లున్న ఫ్రేమ్స్‌, వీటి వర్ణానికి భిన్నంగా ఉండేలా లేతవర్ణం పూలనుంచిన ఫ్లవర్‌వాజ్‌ టీపాయిపై సర్దితే చాలు. గదికి కొత్త అందం వచ్చినట్టే.
హాల్‌ లేదా ముందుగదిని చిన్నచిన్న వస్తువులతోనే కొత్తగా మార్చడానికి ప్రయత్నించొచ్చు. ముందుగా గోడకంతా ఒకే ఫ్రేం లేదా పెద్ద గడియారం వంటివి ఉంటే తాత్కాలికంగా వాటి స్థానంలో చిన్నచిన్న నలుపు, తెలుపు ఫొటోలుంచిన నాలుగైదు ఫ్రేంలను వరసగా సర్దాలి. మిగతా గోడను ఖాళీగా వదిలేయాలి. పుస్తకాల అలమరపై చిన్నచిన్న లేతవర్ణం పూల గుత్తులుంచిన ఫ్లవర్‌వాజ్‌ సర్దాలి. సోఫా ఎదుట టీపాయిపై చిన్నపరిమాణంలో తెలుపు వర్ణంలో అయిదారు సెట్‌గా ఉండే పింగాణి లేదా గాజు ఫ్లవర్‌వాజ్‌లను సర్ది తలా ఒకదాంట్లో ఒకే ఒక లేత వర్ణం గులాబీని ఉంచితే చాలు. వీటి పక్కగా చిన్న గ్లోబ్‌ సర్దాలి. ఇలా చిన్న చిన్న అలంకరణలతోనే గదిని ప్రత్యేకంగా కనిపించేలా చేయొచ్చు.
ఇంట్లో ఏదైనా గది గజిబిజిగా ఉంటే అక్కడ మనకి అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. ఆ ప్రతికూల భావనలను ఎలా దూరం చేయొచ్చంటే.. బయటి వెలుతురు ప్రసరించేలా లేతవర్ణం కర్టెన్లు వేయాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్య కిరణాలు గదిలోకి పడేలా కిటికీలను తెరిచి ఉంచాలి. గది మధ్యలో ముదురువర్ణం కార్పెట్‌ పరవడం మంచిది. ఫ్లోర్‌ సిట్టింగ్‌ కుషన్స్‌ ఏర్పాటుతోపాటు ఆకర్షణీయంగా కనిపించేలా ముదురువర్ణం కవర్లున్న దిండ్లు సర్దాలి. వీటికి ఓవైపు చిన్న నేలబారు టీపాయిలాంటిది అమర్చి, దీనిపై వెదురుతో చేసిన తొట్టెల్లో ఇండోర్‌ప్లాంట్స్‌తోపాటు ప్రశాంతంగా కనిపించే చిన్న బుద్ధుని విగ్రహం సర్దాలి. గది నాలుగుమూలల ఇండోర్‌ ప్లాంట్స్‌తోపాటు ఓవైపు లేతవర్ణం చిత్రలేఖనం ఫ్రేంను నేలపైనే గోడకు అనించాలి. ఇవన్నీ మనసుకెంతో ప్రశాంతతను అందిస్తాయి.

Spread the love