పచ్చని పల్లెల్లో బెల్ట్ దందా

– ఉదయం 6 నుండి రాత్రి 10.30 వరకు కొనసాగింపు
– పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు
నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలంలోని పచ్చని పల్లెల్లో బెల్ట్ దందా అధికారికంగా కొనసాగుతుంది. గత సంవత్సర కాలంగా బెల్ట్ దందాను ఆపే వారే కరువయ్యారు.గ్రామానికి రెండు బెల్ట్ షాపుల చొప్పున నెలకొల్పి మద్యం ప్రియులకు అధిక ధరలకు అమ్మి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైంజ్ అధికారులు గ్రామాల్లోకి రావడం లేదు.పైగా ఓ విలేకరి ఎక్సైంజ్ సిఐ వివరణ కోరగా నా దృష్టికి ఆ విషయం రాలేదని, బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉన్నవనే విషయం కూడా నాకు తెలువదని బుకాయించారు. బెల్ట్ షాప్ నిర్వాహకులపై రాత పూర్వకంగా కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటానని అన్నారు. ఉదయం 6 నుండి మొదలైన బెల్ట్ దందా రాత్రి 10.30 అయిన ముగియకుండా, ఆ ప్రాంతం అంతా జాతర వాతావరణం కొనసాగుతుంది. పైగా బెల్ట్ షాప్ నిర్వాహకులు వారికోసం మద్యం సిట్టింగ్ రూంలను సైతం ఏర్పాటు చేశారు. మద్యం సేవించిన అనంతరం మందుబాబులకు కిక్కు ఎక్కువై వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు కలిగించడమే గాక బెల్ట్ షాపుల యజమానులతో, తోటి మందుబాబులతో గొడవలకు దిగడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తొర్తి, బట్టాపూర్, తడపాకల్,దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాల్లో నడి గ్రామంలో బెల్ట్ షాపులు దర్శనమిస్తాయి. బెల్ట్ షాపు నిర్వాహకులు లైట్ బీర్ పై, స్ట్రాంగ్ బీర్ పై 10 రూపాయలు, క్వాటర్ పై 10 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలను ఎమ్మార్పీ రేటు కంటే అదనంగా వసూలు చేస్తూ.. మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైంజ్ అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు వారిపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Spread the love