పనులు పంచుకోండి

ఇంటి పనులంటూ ఉదయం లేచిన దగ్గర్నుంచీ సతమతమైపోతాం. ఆఫీసుకెళ్లే సమయానికి అందరికీ అన్నీ సమకూర్చాలంటే ఎంత హడావుడి. కొంత ముందస్తు సన్నద్ధత చేసుకోండిలా..
ఉదయాన్నే చేయాల్సిన వంట, ఇంటి పనుల గురించి ముందు రోజే ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంటే సరి. రోజూ చేయాల్సిన వాటిని, తరచూ మర్చిపోయే వాటిని ఓ పుస్తకంలో రాసి పెట్టుకుంటే మరీ మంచిది. సమయానికి చేయాల్సిన పనులు మర్చిపోకుండా ఉంటాం. రోజూ చేసే పనులతో విసుగు అనిపించినప్పుడు నచ్చిన పాటలు పెట్టుకొని పనిని ఆస్వాదిస్తూ చేయండి. దాంతో పనీ అయిపోతుంది, రోజంతా ఉల్లాసంగా కూడా ఉంటుంది.
ఉదయాన్నే హడావుడిగా కూరగాయలు తరగటం వల్ల ఎన్ని సార్లు చేతులు కట్‌ చేసుకుంటాం? పనీ ఆలస్యమవుతుంది. అలాకాకుండా కూరగాయల్ని ముందు రోజు రాత్రే తరిగి మూత బిగుతుగా ఉన్న డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి. సెలవు రోజుల్లో వారానికి సరిపడా టిఫిన్‌కి పిండి రుబ్బి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మిగిలిన రోజుల్లో కంగారు ఉండదు. రోజూ వేసే ఇడ్లీ, దోశ బోర్‌ అనిపించినా రాగి లేదా గోధుమపిండిలో కాస్త పెరుగు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్‌ తరుగు వేసి దోశలు వేస్తే పనీ తేలిక అవుతుంది, పిల్లలూ ఇష్టంగా తింటారు. రాగి పిండితో ఇడ్లీ వేయడం తేలిక, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆఫీసుకి వెళ్లేముందు హ్యాండ్‌బ్యాగు సర్దుతూ కూర్చుంటే సమయం వృథా అవుతుంది. ముందు రోజు రాత్రే కావల్సినవన్నీ బ్యాగులో సరుకోవడం, ఉదయానికి కావల్సిన దుస్తులూ పక్కన పెట్టుకోవడం చేస్తే కంగారుండదు.
అన్ని పనులూ మన నెత్తిన వేసుకోవటం వల్లే హడావుడి, శారీరక శ్రమ కూడా. ఇంట్లో మిగిలిన వారు చేయగలిగిన పనులు.. ఉతికిన దుస్తులు ఆరబెట్టడం, మడత పెట్టడం, మొక్కలకి నీళ్లు పోయటం లాంటి చిన్న చిన్న పనులు కుటుంబ సభ్యులకు చెప్పండి. పని సులువవుతుంది. పిల్లలకైతే ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు కొన్ని సలహాలు ఇచ్చి దగ్గరుండి వారితో చేయించే ప్రయత్నం చేసి చూడండి. ఉదాహరణకు ఫ్లవర్‌వాజుల్లో పూలు మార్చడం లాంటివి. వారి లంచ్‌ బాక్సులు, వాటర్‌ బాటిల్స్‌ వారితోనే సర్దించండి ఉత్సాహంగా చేస్తారు. అదనంగా కుటుంబంతో అనుబంధం కూడా పెరుగుతుంది. ప

Spread the love