– తెలంగాణ స్టేట్ ఇండిస్టియల్ ట్రేడ్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షులు మారుతీ రావు
నవతెలంగాణ -నాచారం
నాచారం పారిశ్రామిక వాడలోని రోడ్ నెంబర్ 6లో గల జాలా రామ్ రాజ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ స్టేట్ ఇండిస్టియల్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బూరుగు మారుతీ రావు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో 17 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్న కార్మికులను చెప్పాపెట్టకుండా విధుల్లో నుంచి తొలగించి కంపెనీని మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ తరలించారని పేర్కొన్నారు. చట్టబద్ధంగా కార్మికులకు సెటిల్మెంట్ చేయకుండా కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ తరలించే ముందు సెటిల్మెంట్ నోటీస్ ఇవ్వకుండా కనీసం కార్మికులకు తెలియకుండా కంపెనీని తరలించడం చట్ట విరుద్ధమని కార్మిక సంఘాల నాయకులు లేబర్ కమిషనర్ దష్టికి తీసుకువెళ్లారు. కార్మికుల చట్టం ప్రకారం ఉద్యోగ భద్రత, సెటిల్మెంట్, బోనస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్, కార్మికులు పర్వీన్, లక్ష్మి, నరసింహ, అనిల్, రాజు, కుమార్ పాల్గొన్నారు.