పర్యాటక భూమిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కన్ను

– రూ.225కోట్ల భూమిని రూ.69 కోట్లకే కాజేసే యత్నం
– బినామీ సంస్థ పేరుతో రంగంలోకి దిగిన మంత్రి
– మౌనం వీడని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
– కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బక్క జడ్సన్‌ ఆరోపణలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆ శాఖ పరిధిలోని రూ.225 కోట్ల విలువైన మూడెకరాల భూమిని రూ.69 కోట్లకే కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బక్క జడ్సన్‌ విమర్శించారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూ ట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌)లో ఉన్న మూడెకరాల భూమిని కిషన్‌రెడ్డి కారు చౌకగా వేలం పేరుతో దక్కించుకోబోతున్నారని తెలిపారు. ఇందుకోసం తన బినామీ సంస్థను రంగంలోకి దించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి ప్రయివేటు పరం అవుతున్నా…. పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో యువత కు పర్యాటక రంగంలో మెళకువలను నేర్పిస్తూ, స్వదేశీ, విదేశీ ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిథిమ్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 26 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. రూ.10 కోట్లను కేటాయించిం దని గుర్తు చేశారు. ఇందులో మూడెకరాల భూమిని రాజస్థాన్‌కు చెందిన ఎల్‌.ఎన్‌.శర్మకు కేటాయిస్తూ ఆనాటి పర్యాటకశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఆ భూమిని హౌటల్‌ నిర్మాణం కోసం ఉద్దేశించారు. ఆయనకు ఆ వ్యాపారంలో ఎలాంటి అనుభవ మున్నట్టు ఇప్పటికీ ధృవీకరించుకోలేదని తెలిపారు. కేటాయించిన ప్రభుత్వ భూమిని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కన్సార్టియం వద్ద తాకట్టు పెట్టి రూ.159 కోట్లు రుణం పొందారని తెలిపారు. ఆ రుణంలో నుంచి కేవలం రూ.30 కోట్లను మాత్రం నిర్మాణానికి వెచ్చించి పూర్తి చేయకుండా మిగిలిన సొమ్మును మళ్లించి బ్యాంకుకు ఎగవేశారని వివరించారు. దీంతో సదరు భూమిని బ్యాంకు ఎన్‌పీఏ జాబితాలో చేర్చిందని తెలిపారు. శర్మపై ఇది వరకే ట్రిడెంట్‌ హౌటల్‌ విషయంలో రూ.1,200 కోట్లు మోసగించారనే ఆభియోగంతో సీబీఐ కేసు నమోదైందని చెప్పారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పీఎంఓ
కేంద్ర పర్యాటకశాఖలో విలువైన భూములను ప్రయివేటుపరం చేసేందుకు జరుగుతున్న కుట్రలను వివరిస్తూ కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రి రేణుకాచౌదరి 2022 అక్టోబర్‌ 11న పీఎంఓకు లేఖ రాసినప్పటికీ సమాధానం రాలేదని జడ్సన్‌ ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా తాను సీబీఐకి ఐదుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిథిమ్‌ పాలక మండలిలో కేంద్ర పర్యాటకశాఖ నుంచి ఐదుగురు సభ్యులున్నప్పటికీ ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ఆ సంస్థ ఇప్పటికీ తన పేరిట టైటిల్‌ తెచ్చుకోకపోగా, సదరు సంస్థకు కేటా యించిన 26 ఎకరాల భూమి వ్యవసాయ భూమిగానే చూపిస్తున్నదని తెలిపారు.
2011 నుంచి 2014 సంవత్స రాల్లో శర్మ సప్తర్షి హౌటల్స్‌ డైరెక్టర్‌గా నాలుగు స్టార్‌ హౌటళ్ల నిర్మాణానికి పంబాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కన్సార్టియం నుంచి రూ.159 కోట్లు రుణంగా తీసుకున్నా రని తెలిపారు. రేణుకాచౌదరి, తాను ఇచ్చిన ఉత్తరాలపై తీసుకున్న చర్యలను తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కింద అడిగిన వాటికి పీఎంఓ నుంచి గానీ, కేంద్ర పర్యాటకశాఖ నుంచి గానీ ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు.
కిషన్‌ రెడ్డి రాజీనామా చేయాలి
ఈ నేపథ్యంలో కిషన్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని జడ్సన్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రభుత్వమే ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని కోరారు. కేంద్ర మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌.ఎన్‌.శర్మతో పాటు ప్రాజెక్టు పురోగతిని పరిశీలించకుండా రూ.159 కోట్ల రుణమిచ్చిన బ్యాంకు అధికారులు, చట్టవిరుద్ధంగా భూమిని లీజుకిచ్చిన రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌పై నమోదు చేయాలని సీబీఐని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అసంఘటిక కార్మికుల సెల్‌ చైర్మెన్‌ డి.లక్ష్మణ్‌ యాదవ్‌, నాయకులు వెంకటేష్‌, సామాజిక కార్యకర్తలు పాండు, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Spread the love