పీఆర్సీపై విద్యుత్‌ ఉద్యోగుల చర్చలు విఫలం

– ఆందోళనలు యథాతథం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణపై యాజమాన్యం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యుత్‌ సంస్థల సీఎమ్‌డీలు, ఇతర ఉన్నతాధికారులు సోమవారం విద్యుత్‌సౌధలో కార్మిక సంఘాల జేఏసీల నేతల్ని చర్చలకు ఆహ్వానిం చిన విషయం తెలిసిందే. చర్చల ప్రారంభంలోనే అధికారులు పీఆర్సీ కమిషన్‌ 5 శాతం వేతన సవరణ సిఫార్సు చేసిందనీ, తాము మరో ఒక్క శాతం కలిపి 6 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని ప్రతిపాదించారు. దీనిపై జేఏసీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 30 శాతానికి తగ్గకుండా వేతనాలు పెంచాల నీ, ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పుతో పాటు ఇతర అంశాలపై కూడా ఒక నిర్ణయానికి రావాలని కోరారు. దాదాపు మూడు గంటలకు పైగా చర్చలు జరిగినా అధికారులు తమ ప్రతిపాదనను మాత్రమే వినిపించారు. దీనితో తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఈఏ) జేఏసీ నేతలు సమావేశం మధ్యలోంచి అర్థంతరంగా లేచివచ్చేశారు. టీఈఈఏజేఏసీ నేతలతో చర్చించేందుకు యాజమాన్యం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వారు కూడా యాజమాన్య ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో చర్చలు జరిగిన తీరును విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, మరోసారి జేఏసీలను చర్చలకు ఆహ్వానిస్తామని సీఎమ్‌డీలు చెప్పారు. దీనితో చర్చలు అర్థంతరంగా వాయిదా పడ్డాయి. అనంతరం టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు, టీఎస్‌ ట్రాన్స్‌కో జేఎమ్‌డీ శ్రీనివాసరావు తదితరులు మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి చర్చల సారాంశాన్ని వివరించారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాననీ, జేఏసీ నేతల్ని మరోసారి చర్చలకు ఆహ్వానించాలని మంత్రి వారికి సూచించినట్టు సమాచారం. యాజమాన్యంతో చర్చల్లో టీఎస్‌పీఈఏ జేఏసీ చైర్మెన్‌ పీ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌రావు, కో చైర్మెన్‌ ఈ శ్రీధర్‌, కో కన్వీనర్‌ బీసీ రెడ్డి, వైస్‌ చైర్మెన్‌లు వజీర్‌, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. తమ జేఏసీ పీఆర్సీ కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్ణయించిన ఆందోళన కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. చర్చల్లో టీఎస్‌ఈఈఏజేఏసీ అధ్యక్షులు ఎన్‌ శివాజీ తదితరులు కూడా పాల్గొన్నారు.

Spread the love