– అన్ని వర్గాలకూ ప్రతికూలం
– గణనీయంగా తగ్గిన కేటాయింపులు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2023-24 కార్పొరేట్లకు తప్ప ప్రజలకు ఏమాత్రమూ ఉపయోగపడదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. జిమ్మిక్కులు, ఆర్భాటం తప్ప ఇది పూర్తిగా డొల్లతనంతో కూడిన బడ్జెట్ అన్నారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సమావేశానికి హాజరైన తమ్మినేని, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల గురించి బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదన్నారు. నిజాన్ని దాచి అందమైన చిత్రాన్ని చూపేందుకు ఆర్థిక సర్వే ప్రయత్నించిందని విమర్శించారు. నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య తదితర ముఖ్యమైన సమస్యలను బడ్జెట్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో శక్తినిస్తుందని కేంద్రం చెబుతున్నదని, మరి ఆర్థిక వృద్ధిరేటు 6.5శాతానికే పరిమితమవుతుందని ఆర్థిక సర్వే ఎందుకు అంచనా వేసిందని ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వృద్ధిరేటు 9.9శాతం నుంచి 1.6శాతానికి పడిపోయిందన్నారు. ఏకబిగిన నాలుగేండ్ల ఆర్థికవృద్ధి తగ్గటం స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. ఆహార సబ్సిడీని 29 శాతానికి తగ్గించారని, మధ్యాహ్న భోజనానికి నిధులు 9.4శాతం తగ్గాయని, పౌష్టికాహార పథకాలకు ఏకంగా 38 శాతం తగ్గా యని విమర్శించారు. బడ్జెట్లో అణగారిన వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూసి ఆర్థిక విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారన్నారు. నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు తప్పనిసరి అన్నారు. ఈ బడ్జెట్‌లో అలాంటివేవీ చోటు చేసుకోలేదని తెలిపారు. వికలాంగులపైన కేంద్రం వివక్ష చూపిందని, మైనారిటీలకైతే బడ్జెట్‌లో గతేడాది కంటే ఏకంగా 33 శాతం నిధులను తగ్గిం చిందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటే ఓశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, బొంతు రాంబాబు, వై.విక్రమ్, చింతలచెర్వు కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బండి రమేష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.