– బీజేపీ విషయంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల ఎజెండా ఒక్కటే
– మునుగోడు తరహాలోనే ఖమ్మంలో బీజేపీని నిలువరిస్తాం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా? ఉండవా? అన్నది ఇప్పుడే చెప్పబోమనీ, ఒకవేళ పొత్తులు కుదిరినా సీట్ల విషయంలో త్యాగయ్యలం కాబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇకపై సీపీఐ, సీపీఐ(ఎం) ఒకే తాటిపై వెళ్తాయనీ, ఎన్నికలు, కార్యాచరణపై ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడం మునుగోడుతో మొదలైందనీ, ఖమ్మం జిల్లాలోనూ ఆ పార్టీని వెనక్కి కొడతామని చెప్పారు. ఆ పార్టీని ఎదుర్కొనే విషయంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల భావజాలం, ఎజెండా ఒక్కటేనన్నారు. అయితే, ప్రజా సమస్యలపై పోరాటాల విషయంలో మాత్రం తగ్గేదే లేదని నొక్కి చెప్పారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపైనా, ఇండ్ల స్థలాలు, సింగరేణి తదితర అంశాలపైనా చేసిన పోరాటాలను వివరించారు. తామేమి త్యాగయ్యలం కాదనీ, ముందు దేశ ప్రయోజనాలు, తరువాత పొత్తుతో ఉండే పార్టీ ప్రయోజనంతో పాటు, తమ ప్రయోజనం కూడా నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం త్యాగం చేస్తామే తప్ప ఇంకో పార్టీ కోసం కాదనీ, తమకు కూడా గౌరవప్రదంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పొత్తు గురించి ప్రశ్నించగా, బీజేపీని ఓడించడమే కమ్యూనిస్టు పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకు బలమైన పార్టీతో కలిసి అవగాహన చేసుకుంటామని, కాంగ్రెస్ ప్రజాతంత్ర, లౌకిక పార్టీ అయినప్పటికీ ముందు వాళ్ళు తమ ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. అధికార దుర్వినియోగం, బెదిరింపులతో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. సుజానా చౌదరి, సీఎం.రమేశ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి అలాగే చేరారని తెలిపారు. ఇప్పుడు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారితో పాటు అనేక మంది ఆ జాబితాలో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు ఈ నెల 18న ఖమ్మంలో జరిగే ఆ పార్టీ ఆవిర్భావ సభకు వెళ్తున్నామని చెప్పారు. ఆ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇరు పార్టీల రాష్ట్ర నాయకులకు కూడా ఆహ్వానం ఉందని తెలిపారు. ఏప్రిల్ నెలలో సీపీఐ ఆధ్వర్యంలో లక్ష మందితో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను కూడా మోడీ సర్కారు రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఐఎఎస్ క్యాడర్ సంబంధించి హైకోర్టు తీర్పు విషయంలో తప్పు ఒప్పుల జోలికి వెళ్ళబోమనీ, అయితే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయన్ను తెలంగాణ క్యాడర్ నుండి కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసిన తీరు అభ్యంతరకరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ, పబ్లిక్ సెక్టార్ తెగనమ్ముతూ, గవర్నర్ వ్యవస్థ, ఐటీ, సీబీఐ, ఈడీలాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తూ సర్వాధికారాలను తన చేతుల్లో పెట్టుకుని మోడీ సర్కారు నియంతాల వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో కేంద్ర ప్రభుత్వం తన చేతిలో పంజరంలో చిలుకలా ఉన్న సీబీఐని ప్రయోగించిందన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్‌ను కూనంనేని పునరుద్ఘాటించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్, తక్కల్లపల్లి శ్రీనివాస రావు, బాల నర్సింహా, కలవేన శంకర్ తదితరులు పాల్గొన్నారు.