పోరాటాల ఫలితమే కార్మికుల వేతనాల పెంపు

– మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
మధ్యాహ్న భోజన కార్మికులు తమ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసిందని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్న భోజన కార్మికుల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కార్మికులను ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కార్మికులు అనేక కష్టనష్టాల కోర్చి మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారని చెప్పారు. యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమ కోసం అనేక పోరాటాలు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రూ. 2000 వేతనం పెంచుతూ జీవో జారీ చేసిందని తెలిపారు. ఇదంతా కార్మికుల ఘన విజయమన్నారు. పెంచిన వేతనం గతేడాది అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కోసం ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వేతనాలు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కార్మికులు స్వీట్లు పంచుకొని అభినందన సభ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు తోపునూరు చక్రపాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్‌గౌడ్‌, నూర్జహాన్‌, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు సాయమ్మ, నాగలక్ష్మి, వివిధ మండలాల నుంచి కార్మికులు పాల్గొన్నారు.

Spread the love