పోరాడితేనే బతుకు

– ఆ దిశగానే విద్యుత్‌ ఉద్యోగుల కార్యాచరణ ఉండాలి
– టీఎస్‌యూఈఈఈ డైరీ ఆవిష్కరణలో నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌ సుధాభాస్కర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థల పరిరక్షణ కోసం మిలిటెంట్‌ పోరాటాలే శరణ్యమనీ, అప్పుడే ఉద్యోగులు, వ్యవస్థ బతకగలుగుతాయని నవతెలంగాణ దినపత్రిక సంపాదకులు ఆర్‌ సుధాభాస్కర్‌ అన్నారు. పోరాటాలు ఉంటేనే యూనియన్లూ బలపడతాయని చెప్పారు. తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌యూఈఈఈ) ఆధ్వర్యాన బుధవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 2023 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై డైరీ ఆవిష్కరించి, మాట్లాడారు. విద్యుత్‌ శాఖలో ఒకప్పుడు అధికారులు కాంట్రాక్ట్‌ కార్మికులతో టిఫిన్‌ బాక్సులు కడిగించేవారనీ, వారంతా సంఘటితం అయ్యాక ఆపని చేయించేందుకు ఎవరూ సాహసించట్లేదనీ, సంఘానికి ఉండే బలం అదేనని ఉదహరించారు. విద్యుత్‌రంగంలో 1996 నుంచి ప్రయివేటీకరణ విధానాలు ప్రారంభమయ్యాయనీ, 2001లో విద్యుత్‌ చట్టం తయారైతే, 2003లో అప్పటి ప్రధాన మంత్రి వాజ్‌పేయి ప్రభుత్వం దాన్ని ఆమోదించిందనీ, చట్ట సవరణల పేరుతో ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాని అమలును మరింత వేగవంతం చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకించట్లేదనీ, సవరణ బిల్లు-2022ను మాత్రమే వ్యతిరేకిస్తున్నదనే విషయాన్ని గమనించాలని సూచించారు. మహారాష్ట్రలో ఎన్రాన్‌ వంటి బహుళజాతి సంస్థలు ప్రజాధనాన్ని లూటీ చేసి, బోర్డులు తిప్పేస్తే, ఆ విద్యుత్‌ప్లాంట్లను గెయిల్‌, ఎన్టీపీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహణ చేపట్టాయని గుర్తుచేశారు. ప్రయివేటు పెట్టుబడిదారుల వల్ల ఇలాంటి దుష్పరిణామాలు ఉంటాయనే అనుభవం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకొనే దిశగా ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. విద్యుత్‌ సవరణ బిల్లులో ‘ఆవరణ’ (ప్రెమిసెస్‌) అనే పదాన్ని విస్తరించి, దాన్ని దేశవ్యాప్తం చేశారని చెప్పారు. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడ తక్కువ ధరకు కరెంటు దొరికితే, అక్కడి నుంచి పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు ఎక్కడికైనా విద్యుత్‌ను తెప్పించుకొనే సౌకర్యం కల్పించారని తెలిపారు. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంలు) పరిధి కుదించుకుపోతుందనీ, ఇక ఉద్యోగులు, హక్కులు, రెగ్యులరైజేషన్‌, వేతన సవరణలు వంటి వాటికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ ప్రమాదాలను విద్యుత్‌ ఉద్యోగులు గుర్తించాలని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఓ ప్రాంత విద్యుత్‌ పంపిణీని అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తే, అక్కడి ఉద్యోగులు పోరాటాల ద్వారా తిప్పికొట్టగలిగారనీ, ఛత్తీస్‌గఢ్‌, పాండిచ్చేరిలోనూ ఇలాంటి ఉద్యమాలే ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల్ని కాపాడాయని గుర్తుచేశారు. టీఎస్‌యూఈఈఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ గోవర్థన్‌ వాల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరించి మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగులు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు, సాధించాల్సిన హక్కులు అనేకం ఉన్నాయని చెప్పారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమం భవిష్యత్‌ ఉద్యమ రూపానికి వేదిక అనీ, విద్యుత్‌ ఉద్యోగులు మెడపై ప్రయివేటీకణ కత్తి వేలాడుతూనే ఉన్నదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీకి పంపిందనీ, ఆ కమిటీలో మెజారిటీ సభ్యులు బీజేపీకి చెందినవారే ఉన్నందున, అక్కడ ఆ బిల్లును తిరస్కరిస్తారనే భ్రమలు తమకేం లేవని స్పష్టం చేశారు. కేంద్రం మొండిగా ఆ బిల్లును చట్టరూపంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు మెరుపు సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు కూడా ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు కలిసికట్టుగా కొట్లాడితేనే కేంద్రం మెడలు వంచి, ఈ బిల్లును తిప్పికొట్టగలమని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యోగులకు 2022 పీఆర్సీ బకాయి ఉన్నదన్నారు. సంస్థల పరిరక్షణ, హక్కుల సాధనలో భాగంగా ఈనెల 17న రాష్ట్రంలోని అన్ని ఎస్‌ఈ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 10 నుంచి 24వ తేదీ వరకు అన్ని విద్యుత్‌ సంస్థల్లోని ఉద్యోగులను చైతన్యపరుస్తూ జీపు జాతాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి టీఎస్‌యూఈఈఈ రాష్ట్ర అధ్యక్షులు కే ఈశ్వరరావు అధ్యక్షత వహించి, టేబుల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరించారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు వీ కుమారచారి తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ స్వామి, ఉపాధ్యక్షులు కే మధు, వెంకటేశ్వర్లు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ చంద్రారెడ్డి, కే సత్యం, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, ఎన్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love