జానపదులు అచ్చమైన సాహిత్య కారులు. పచ్చి పల్లెటూర్లే అసలైన కళా సృజన కేంద్రాలు. కైగట్టి పాడే పదం అక్కడే పుడుతది. అక్కడి భాషణంలో నాదస్వరం తేలి ఆడుతది. విషయాన్ని కథనంగా పోల్చి చెప్పేప్పుడు ప్రజలు సామెతలు వాడుతారు. సామెతలు అంటే సామీప్యతలు. పోలిక పోల్చి చెప్పడం. పది వాక్యాలు విడమర్చి చెప్పే దానికన్నా ఒక్క ఉపమానం ఉపయోగిస్తారు. సామెతలకు సృష్టికర్తలు ప్రజలే. పరంపరగా వస్తున్న అద్భుతమైన పద సంపద ఇది.
ఎద్దు ఉన్నోనికి బుద్ధి ఉండది – బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండది
పల్లెల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి . ఎడ్లతో నేలను దున్ని వ్యవసాయం చేస్తారు. ఎడ్లను మెదిపి మోటకొట్టేందుకు, నాగలి దున్నేందుకు వ్యవసాయదారుడు బుద్ధి నైపుణ్యత ఉపయోగించాలి. అయితే ఆ కాలంలో వ్యవసాయం చేసేందుకు అవసరమైన పశుసంపద కరువే. ఇక్కడ బుద్ధి ఉన్నది కానీ ఎద్దు లేదు అనే సామెత ఉదయించింది. మరొక దగ్గర ఎడ్లు ఉంటాయి నైపుణ్యత గల బుద్ధి శకలత ఉండకపోవచ్చు. మంచి జోర్దార్ కొల్ల్యాగలు ఉండి వాటిని నాగలికి మెదుపరాని పరిస్థితి. అందువలన ఇక్కడ ఎద్దు ఉన్నది బుద్ధి లేదు. ఎద్దు బుద్ధి అనే ప్రాస పదాల వాడకంతోనే విషయాన్ని సూటిగా చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
పల్లెలో వ్యవసాయం నుంచి పుట్టిన ఈ సామెతను అన్ని రంగాల్లో వాడుతుంటారు. అట్లాగే
ఆకలి రుచి ఎరుగది -నిద్ర సుఖమెరుగది
ఆకలి బాగా అయితే అటుకులైన తిని పడుకుంటారు. అన్నంలో తొక్కు ఆయినా పెట్టుకుని తింటారు. ఆకలి లేకుంటే కూరల ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా లొల్లి పెడతరు. రుచి అనేది ఆకలి మీద ఉంటది అని అర్థం.
అట్లాగే నిద్ర సుఖమెరుగదు. బాగా నిద్ర వచ్చింది అంటే కూర్చొని నిద్రపోతారు బస్సులో నిద్రపోతారు రైల్లో నిద్రపోతారు. నిద్ర బాగా వచ్చినప్పుడు కటిక నేల మీద నైనా ఒరుగగానే నిద్ర పడుతుంది. నిద్ర లేకుంటే ఎంతటి మెత్తటి పరుపుల మీదనైనా అటు ఇటు బొర్రుడే గాని నిద్ర రాదు. ఈ పోలికలతోనే ఃఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదుః అనే సామెత పుట్టింది.
సామెతలు ప్రజల అనుభవాల నుంచి ఆలోచన నుంచి సృష్టించబడినవి. వీటిని అవసరమైన రీతిలో మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
– అన్నవరం దేవేందర్, 9440763479