ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టండి ..

– రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌
– ఏప్రిల్‌ 5న ఢిల్లీలో కదం తొక్కండి
నవ తెలంగాణ-కందనూలు

కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ అన్నారు. ఆదివారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా సదస్సును సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సాగర్‌ మాట్లాడుతూ.. ప్రజా సంఘాల ఐక్యవేదిక, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 5వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున 10 లక్షల మందితో కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు ప్రజలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు ప్రయత్నిం చిందని తెలిపారు. దానిపై ఏడాదిపాటు పోరాడిన రైతులు, వారు చేసిన త్యాగాల ఫలితంగా చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. కాని వాటిని దొడ్డిదారిలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అలాగే, విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని, ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపులు, 200 పనిదినాలు, కనీస వేతనం రోజుకు రూ. 600 నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం తర్వాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్నదన్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love