ప్రజాస్వామ్యానికి బ్రెజిలియన్ల మద్దతు

– లూలా సర్కార్‌కు సంఘీభావంగా భారీ ర్యాలీలు
– బోల్సనారోను జైలుకు పంపాలని నినదించిన ప్రజలు
– జన సందోహంతో నిండిపోయిన
సావోపోలో, రియో నగరాలు
బ్రసీలియా : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బ్రెజిలియన్లు కదంతొక్కారు. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సనారో అనుచరుల దాడిని ఖండిస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని లూలా సర్కార్‌కు మద్దతుగా నినదించారు. అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు లొంగిపోయిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సనారో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేక దేశ న్యాయవ్యవస్థపైనా అబాండాలు మోపుతూ.. గత ఆది, సోమవారాల్లో పార్లమెంట్‌, అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయస్థానాలపై బొల్సనారో తన అనుచరులతో మూకుమ్మడి దాడులు చేయించారు. ఈ దాడులను మంగళవారం దేశవ్యాప్తంగా రియో డీ జెనిరో, సావోపోలో సహా పలు నగరాల్లో వేలాదిమంది ప్రజాస్వామ్య అనుకూల ర్యాలీలు నిర్వహించారు. ‘క్షమాభిక్ష లేదు, బోల్సనారోను జైలుకు పంపాలి’ అని నినదిస్తూ అతిపెద్ద నగరమైన సావోపోలోలో వేలాదిమంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. బ్రెజిల్‌లో అత్యంత ప్రఖ్యాతి చెందిన వీధి పాలిస్టా అవెన్యూలో ఒక భాగం బ్రహ్మాండంగా సాగిన ప్రజా ప్రదర్శనతో పూర్తిగా నిండిపోయింది. మొత్తంగా ఎక్కడ చూసినా జనం… న్యాయం కోసం నినదిస్తూ ముందుకుసాగారు. ఆ ప్రాంతమంతా అరుణవర్ణమయమైంది. లూలా వర్కర్స్‌ పార్టీ పతాకమైన ఎరుపు రంగు దుస్తులు ధరించారు. ‘కుట్రదారులకు క్షమాభిక్ష లేదు’ అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆదివారం నాటి మూక దాడులకు కారకులైన వారిని శిక్షించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బోల్సనారోకు జైలే గతి అంటూ నినాదాలు చేశారు.

Spread the love