– వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
– చలో పార్లమెంట్ విజయవంతం చేయాలి
హౌరా నుంచి నవతలెంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను కదలించాలని, గ్రామస్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, అలాగే కేంద్రానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5న నిర్వహిస్తున్న చలో పార్లమెంటును విజయవంతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. హౌరాలోని శరత్‌సదన్ (జ్యోతిబసునగర్లో) జరుగుతున్న అఖిల వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర విధానాలపై ప్రతిఘటన రాకపోతే ప్రజావ్యతిరేక విధానాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచారని, కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికులను అణగదొక్కారని, ఉపాధి హామీని తగ్గించి వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో చేపట్టిన చలో పార్లమెంటును కార్యక్రమాన్ని విజయంతం చేయడం ద్వారానే హక్కులను కాపాడు కోవచ్చని తెలిపారు. ఉపాధి హామీని నిర్వీర్యం వెనుక బిజెపి కుట్రపూరిత వైఖరి ఉందని పేర్కొన్నారు. చలో పార్లమెంటు కార్యక్రమం ఉంటే ఒక ప్రదర్శనే కాదని, మొత్తం ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలను తీసుకెళ్లడం ప్రధానమని చెప్పారు.