ప్రతి పేదవానికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం

– టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దళిత, ఆదివాసీ పేదలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిస్తామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం నుంచి మొదలైన హాత్‌సే హాత్‌ జోడో పాదయాత్ర అశ్వాపురం మంచి కంటి నగర్‌, జగ్గారం, మిట్టగూడం, కళ్యాణపురం మీదగా మణుగూరు మండలంలోని తోగూడెంలోకి సోమవారం అడుగుపెట్టింది. గిరిజన సంప్రదాయాలతో ప్రజలు రేవంత్‌కు స్వాగతం పలికారు. ప్రధాన రహదారి వెంట ప్రజలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బంకులు, వివిధ షాపుల్లో పనిచేసే కార్మికులు, మెకానికుల సమస్యలు తెలుసుకున్నారు. జగ్గారం ఎస్సీ కాలనీలో దళితులు తమకు ఇంటి స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించి కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలను కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలని ఇఫ్టు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. బూర్గంపాడు మండలం వరద ముంపు బాధితులు మహిళలు 200 రోజులుగా చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని రేవంత్‌రెడ్డిని కోరారు. మణుగూరు మున్సిపాలిటీని రద్దు చేసి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ చట్టం అమలు చేయాలంటూ వినతిపత్రాలు అందజేశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య, ములుగు శాసనసభ్యురాలు సీతక్క, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా నాయకులు కమటం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.

Spread the love