ప్రపంచ క్లబ్‌ చాంపియన్‌షిప్‌కు అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌

– ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ టైటిల్‌ కైవసం
కోచి (కేరళ) : అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ అదరగొట్టింది. ప్రపంచ మెన్స్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్న తొలి భారత జట్టుగా రికార్డు సృష్టించింది. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ రెండో సీజన్‌ చాంపియన్‌గా నిలిచిన అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌.. ఈ ఏడాది జరుగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది. కోచిలో జరిగిన ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ఫైనల్లో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ 15-7, 15-10, 18-20, 13-15, 15-10తో బెంగళూరు టార్పెడోస్‌పై ఘన విజయం సాధించింది. బెంగళూరు టార్పెడోస్‌కు దూకుడుకు అడ్డుకట్ట వేసి అహ్మదాబాద్‌ను ముందంజలో నిలిపిన అంగముత్తు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఇక టైటిల్‌ పోరు ఆరంభంలో బెంగళూరు టార్పెడోస్‌ దూకుడుగా కనిపించింది. కానీ అహ్మదాబాద్‌ పుంజుకునేందుకు పెద్దగా సమయం పట్టలేదు. తొలి రెండు సెట్లను అలవోకగా సొంతం చేసుకున్న అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ టైటిల్‌కు చేరువైంది. కీలక మూడో సెట్‌లో బెంగళూరు టార్పెడోస్‌ సత్తా చాటింది. టైబ్రేకర్‌కు దారితీసిన ఈ సెట్‌లో బెంగళూరు 20-18తో అహ్మదాబాద్‌పై పైచేయి సాధించింది. ఆ తర్వాత సెట్‌ను సైతం 15-13తో కైవసం చేసుకుంది. 2-2తో సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో మ్యాచ్‌ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది. విజేతను నిర్ణయించే సెట్‌లో ఇరు జట్లు పోటాపోటీగా ఆడాయి. పవర్‌ఫుల్‌ స్పైక్‌లు, కండ్లుచెదిరే బ్లాక్‌లతో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ ముందంజలోకి దూసుకెళ్లింది. నిర్ణయాత్మక సెట్‌ను 15-10తో గెల్చుకుని.. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ రెండో సీజన్‌ చాంపియన్‌గా అవతరించింది. తొలి సీజన్‌ ఫైనల్లో కోల్‌కత థండర్‌బోల్ట్స్‌కు టైటిల్‌ చేజార్చుకున్న అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌.. ఈ ఏడాది పట్టు విడువలేదు. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ టైటిల్‌తో పాటు వరల్డ్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడే అవకాశం సైతం సొంతం చేసుకుంది.

Spread the love