ప్రపంచ దేశాల మధ్య ఐక్యతే లక్ష్యం

–  రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నాటో కూటమి జోక్యం తగదు
–  ఐప్సో జాతీయ మహాసభలో పల్లభ్‌ సేన్‌ గుప్తా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు నశించి శాంతియుత వాతావరణం నెలకొనాలని అంతర్జాతీయ శాంతి సంఘీభావ సంఘం అధ్యక్షులు పల్లభ్‌ సేన్‌ గుప్త ఆకాంక్షించారు. అణుయుద్ధం వస్తే మానవ వినాశనం తప్పదనీ, రష్యా ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఏడాదిపైగా సాగుతూ ఉన్న యుద్ధానికి సామ్రాజ్య వాద నాటో దేశాలే కారణమని చెప్పారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) జాతీయ మహాసభలు పంజాబ్‌ రాష్ట్రంలోని చండీఘర్‌ పట్టణంలో జరుగుతున్నాయి. మహాసభల ప్రారంభ సూచకంగా సభా ప్రాంగణం వద్ద జాతీయ పతాకాన్ని ఆహ్వాన సంఘంం చైర్మెన్‌ ప్రొఫెసర్‌ హెచ్‌ఎస్‌ సిద్దు, ఐప్సో పతాకాన్ని జాతీయ అధ్యక్షులు పల్లబ్‌ సేన్‌ గుప్త ఎగురవేశారు. మహాసభను పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల హైకోర్టు సీనియర్‌ న్యాయవాది అర్‌ఎస్‌ చీమా లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు తమిళనాడు, బెంగాల్‌, కేరళ, పంజాబ్‌, హర్యానా, బీహార్‌, ఒడిస్సా, త్రిపుర, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌్‌, మణిపూర్‌ రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత శాంతి ఉద్యమం, ప్రగతిశీల ఉద్యమంలో సేవలు అందించి మరణించిన వారికి ఈ సందర్భంగా ఐప్సో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ అరుణ్‌కుమార్‌ సంతాపం తెలిపారు. దేశంలో పాలక బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ అజెండా అమలు చేస్తున్నారనీ, విద్యారంగంలో పురాణం జ్యోతిష్యం ప్రవేశపెట్టారనీ, కాషాయకరణ చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వియత్నాం, క్యుబా, అమెరికా, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి శాంతి ఉద్యమ నాయకులు పాల్గొని సౌహార్థ సందేశమిచ్చారు. సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాలపైన అమెరికన్‌ వంటి దేశాల ఆంక్షలు, చిన్న చిన్న దేశాలు, ఇస్లామిక్‌ దేశాలపై దాడులు సాగిస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని విమర్శించారు. మహాసభలో ఐప్సో జాతీయ కమిటీ సభ్యులు డి.సుధాకర్‌, మాజీ ఎమ్మెల్సీ కె యాదవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు జి రఘుపాల్‌, జి. నాగేశ్వరరావు,కేవీఎల్‌, పిఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Spread the love