– మంత్రి పువ్వాడకు టీఎస్‌ఆర్టీసీ జేఏసీ ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ లాభాల్లోకి వస్తేనే కార్మికులకు వేతనాలు పెంచుతామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ కత్తుల యాదయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నదనీ, మరి దాన్ని ఏం చేద్దామని ప్రశ్నించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రభుత్వానికి ఉన్న అప్పు కేవలం రూ.60వేల కోట్లు మాత్రమేననీ, ఇప్పుడు ఆ ఆప్పు రూ.4 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని గమనించాలని ఆదివారంనాడొక పత్రికా ప్రకటనలో సూచించారు. అప్పులు చేసి మరీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీలు జీతాలు ఎలా పెంచుకున్నారని అడిగారు. ఆర్టీసీ కార్మికులకు రెండు వేతన సవరణలు పెండిం గ్‌లో ఉన్నాయనీ, రాష్ట్రంలో ఏ ఉద్యోగికైనా ఇలా ఉన్నాయా అని ప్రశ్నించారు. మును గోడు ఉప ఎన్నికలప్పుడు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు గుర్తు లేవా అని అడిగారు. సంస్థలోకి ప్రయివేటు ఎలక్ట్రిక్ బస్సులు, స్లీపర్ బస్సుల వల్ల ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్‌లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరిం చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టం అమల్లోకి వస్తే, 15 లక్షల కి.మీ తిరిగిన బస్సులను తుక్కుగా మార్చా లనీ, ఇలా చేయడం వల్ల సంస్థలో మూడు వేల బస్సుల సంఖ్య తగ్గుతుందని వివరిం చారు. కొత్త బస్సులు కొనడానికి రాష్ట్ర బడ్జె ట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్ర శ్నించారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి కేటాయించిన రూ.1500 కోట్లు బస్‌పాస్ రీయింబర్స్ మెంట్ డబ్బు తప్ప, అదనంగా ఏమిచ్చారని అడిగారు. సంస్థకు ఇచ్చిన ప్రభుత్వ గ్యారెంటీ రుణాలను వడ్డీలతో సహా తీర్చాల్సింది యాజ మాన్యమేననీ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనూ రూ.1,500 కోట్లు కేటాయింపులు చూపి, సంస్థకు కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చారనే విషయాన్ని గమనించాలని చెప్పారు. బడ్జెట్‌లో రెండు శాతం నిధులు కేటాయించాలని జేఏసీ డిమాండ్ చేస్తుంటే ఎందుకు పట్టించు కోవట్లేదని అడిగారు.