– ఈ ఏడాది చివరకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రెడీ..
– ఆర్థిక, ఆరోగ్య శాఖ
మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-వరంగల్
పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు వరంగల్ జిల్లాలో సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్టు ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం వరంగల్‌లోని సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్మాణానికి నిధుల కొరత లేదని, 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం కావాలి అనే రోజులు వచ్చాయని చెప్పారు. ఇటీవల 926 మంది డాక్టర్‌లను నియమించామని, త్వరలో మెడికల్ కాలేజీల్లో 1200 మంది ప్రొఫెసర్ లను నియమిస్తామని చెప్పారు. 15 మెడికల్ కాలేజ్‌లు ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 9 కొత్త కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని తెలి పారు. ఈ సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిలో 35 రకాల సేవలతో పాటు అవయవ మార్పిడి సేవలు కూడా ఉంటాయని చెప్పారు. మెరు గైన వైద్య సేవల కోసం అధునాతన పరికరాలతో ఈ ఆస్పత్రికి ముఖ్య మంత్రి శ్రీకారం చుట్టారన్నారు. 2000 పడకల ఆస్పత్రి ఈ ఏడాది చివరి నాటికి భవన నిర్మాణం పూర్తవుతుంద న్నారు. దసరా నాటికే పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామ న్నారు. 24 అంతస్తుల నిర్మాణంలో.. వరంగల్ హెల్త్ సిటీ చారిత్రాత్మక భవనం రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయని చెప్పారు. 216ఎకరాల్లో ఈ హెల్త్ సిటీ రూపుదిద్దు కుంటోందన్నారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అన్నారు. చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.