ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే ‘మన ఊరు-మన బడి’

నవతెలంగాణ-బోడుప్పల్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత మనఊరు- మన బడి/మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కమలానగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్‌లో సుమారు రూ.24.50 లక్షల అంచనా వ్యయంతో కూడిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ దర్గా దయాకర్‌ రెడ్డి, మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన బస్తీ-మన బడి అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా మొదటి దశలో బడులన్నింటికీ కామన్‌ కలర్‌కోడ్‌ అమలు చేసి, తరగతి గదులకు పెయింటింగ్‌ పనులు చేపట్టారన్నారు. పాత భవనాలన్నింటికీ ఐదు లేయర్ల పూతతో వాటర్‌ ప్రూఫింగ్‌ ట్రీట్‌మెంట్‌ చేయించడం, ఒక్కొక్క తరగతి గదికి నాలుగు ఫ్యాన్లు, నాలుగు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు బిగించడం, డ్యూయల్‌ డెస్క్‌ బల్లలు, గ్రీన్‌చాక్‌పీస్‌ బోర్డులు, టీచర్లు, గ్రంథాలయాలు, సైన్స్‌ల్యాబ్‌లకు అవసరమ య్యే కుర్చీలు, టేబుళ్లు, స్టూళ్లు వంటి ఫర్నీచర్‌ను సమకూరుస్తున్నారని తెలిపారు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌, కిచెన్‌ షెడ్డు, కాంపౌండ్‌ వాల్‌, మరుగుదొడ్లు నిర్మాణం, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు మొదలైన అభివృద్ధి పనులను చేపడతామన్నారు. మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి/మన బస్తీ- మన బడి కార్యక్రమంతో పిల్లల భవితకు బంగారు భవిష్యత్తుని అందిస్తుందని, ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కుర్ర శివ కుమార్‌ గౌడ్‌, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, డీఈఈ శ్రీనివాస్‌, ఏఈ వినీల్‌కుమార్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జానకి, ప్రధానోపాధ్యాయులు ఎల్‌.సత్యప్రసాద్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love