– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పస్రాలో జెండాలు పాతిన పేదలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని సర్వేనెంబర్-109లోని ప్రభుత్వ స్థలంలో సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి సాంబశివ మాట్లాడుతూ గత 20ఏండ్లుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వే నెంబర్-109 లోని 10 ఎకరాల భూమిని రక్షిస్తూ పేదలకు ఇవ్వాలని అనేక ప్రజా ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. జూన్ 2022న ఇది ప్రభుత్వ భూమిగా పరిగణించి మండల రెవెన్యూ కార్యాలయం స్వాధీనపర్చుకున్నట్టు తెలిపారు. అయినా భూస్వాములు ఆ భూమి తమదే నంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారన్నారు. పోలీసులు 24మంది కార్యకర్తలపై బైండోవర్ కేసు పెట్టినా గుడిసెవాసులందరూ అక్కడే భీష్మించుకు కూర్చున్నారని అన్నారు. పస్రా గ్రామంలో నిరుపేదలు, అద్దె ఇంట్లో వారందరూ 10 ఎకరాల్లో గుడిసెలు వేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసులు స్పందించి పేద ప్రజలకు భూమి పంచాలని అన్నారు.కార్యక్రమంలో అంబాల పోషాలు, సప్పిడి ఆదిరెడ్డి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు
పస్రా గ్రామంలోని సర్వే నెంబర్-109లో పుల్యాల వసంత పేరుపై గతంలో పట్టా అయిన భూమి స్థానిక రైతుల పోరాట ఫలితంగా పట్టా చెల్లదని ములుగు జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య లిఖితపూర్వకంగా ఇచ్చారు. స్థానిక తహసీల్ధార్ కూడా సర్వే చేసి ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో గుడిసెలు వేసినట్లు గుడిసెవాసులు తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిని సాగు చేస్తున్న వ్యక్తి కూడా గతంలో వసంత పేరు మీద పట్టా కాగానే తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పినట్లు తెలిపారు. పట్టా రద్దు అయిన వార్త వినగానే తాను ఖరీదు చేశానని ముందుకు రావడం దుర్మార్గమని పేదలు వాపోతున్నారు.
ఆ భూమి తనదేనంటున్న పస్రా రైతు తనకు సంబంధం లేదని తాసిల్దార్ కార్యాలయానికి లిఖిత పూర్వకంగా ఇచ్చినట్టు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. సుమారు 200 మందికి పైగా గుడిసెలు వేశామని, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. కాగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, జిల్లా నాయకులు పొదిల్ల చిట్టిబాబును ఎస్‌ఐ కరుణాకర్‌రావు అదుపులోకి తీసుకుని పోలిస్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐను వివరణ కోరగా తమకు వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని, విచారించి వదిలివేస్తామని తెలిపారు. వారితోపాటు మరో 30మంది గుడిసె వాసులపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వారిని స్థానిక తహసిల్దార్ అల్లం రాజకుమార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేయనున్నట్టు తెలిపారు.