ప్రయివేటు టీచర్ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

– మంత్రి సబితకు టీపీటీఎల్‌ఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల ఫెడరేషన్‌ (టీపీటీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎ విజరుకుమార్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రయివేటు విద్యాసంస్థల్లో ఎనిమిది లక్షల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నారని వివరించారు. వారు విద్యారంగానికి సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. అయినా వారి కష్టాల కడగండ్ల గురించి పట్టించుకునే వారే లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడానికి వారు కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నారని తెలిపారు. అయినా వారి ఇంటిలో చీకటే కనిపిస్తుందని పేర్కొన్నారు. వారి శ్రమను గుర్తించడం లేదని తెలిపారు. విద్యారంగానికి తోడ్పాటునందిస్తున్న ప్రయివేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు విద్యాసంస్థలతోపాటు అందులో పనిచేస్తున్న వారిని రిజిస్టర్‌ చేయాలనీ, గుర్తింపు కార్డులివ్వాలని కోరారు. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలనీ, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వర్తింపచేయాలని సూచించారు. అర్హులైన వారికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని తెలిపారు. విద్యాసంస్థలు మధ్యలో మూసేయకుండా చట్టం చేయాలని పేర్కొన్నారు. కనీస వేతనం తప్పనిసరి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు సైదులు, కె విజరుకుమార్‌, పి విజరు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love