ప్రేక్షకుల చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాం

డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ-హైబ్రిడ్‌ అల్లుడు’. డా. రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌, మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం విశేషం. తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి సెకండ్‌ లిరికల్‌ సాంగ్‌ ‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’ విడుదల కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. రామజోగయ్యశాస్త్రి రచించగా, రేవంత్‌ ఆలపించిన ఈ సెకండ్‌ లిరికల్‌ సాంగ్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని లాంచ్‌ చేశారు. ఈ సాంగ్‌ ‘సరిగమలు’ ద్వారా అందుబాటులో ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ, ‘కృష్ణారెడ్డి ఈ సినిమాతో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసినట్టే. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. అచ్చిరెడ్డి ప్రతిక్షణం ఈ ప్రాజెక్ట్‌ను నడిపిస్తూ వచ్చారు. మా కల్పనకు సూపర్‌హిట్‌ ఇవ్వటానికి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ అహర్నిశలూ శ్రమించారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. చిత్ర సమర్పకుడు, నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ‘కృష్ణారెడ్డి రెగ్యులర్‌ స్టైల్లో ఉంటూనే నేటి యంగర్‌ జనరేషన్‌ను ఆకర్షించే అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కింది. సి. కల్యాణ్‌ ఆశీస్సులు, నిర్మాణంలో కోనేరు కల్పన తీసుకున్న శ్రద్ధ ఈ సినిమాను పెద్ద హిట్‌ చేస్తాయి. కృష్ణారెడ్డి సినిమాల్లో ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక మెసేజ్‌ కూడా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ప్రస్తుత యంగర్‌ జనరేషన్‌ యూత్‌కు మంచి మెసేజ్‌ ఉంది. ఈ సినిమా చూసే యువతకు ఒక గోల్‌ ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ పాటను ప్రత్యేకంగా రాయించారు. మార్చిలో థియేటర్స్‌లోకి రానున్న ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది’ అని చెప్పారు.

Spread the love