ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతి

– ఫ్లోరైడ్‌పై అలుపెరుగని పోరాటం
– ఇటీవల మంత్రి కేటీఆర్‌తో భోజనం చేసిన స్వామి
– సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ దిగ్భ్రాంతి
నవతెలంగాణ- నల్లగొండ

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు అంశాల స్వామి(32) శనివారం ఉదయం మృతిచెందాడు. శుక్రవారం రాత్రి తన ట్రై సైకిల్‌ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో తలకు తీవ్రగాయాల య్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమిం చడంతో శనివారం ఉదయం మృతి చెందాడు. స్వామికి ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి సత్యనారాయణకు ఐదేండ్ల కిందట పక్షవాతం వచ్చింది.
తల్లి వెంకటమ్మ 20 ఏండ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతూ ఎటూ కదల లేక జీవత్సంలా ఉంది. ఒక చెల్లి ఫ్లోరోసిస్‌తో బాధపడుతూ చని పోయింది. మరో చెల్లి అనారోగ్యంతో మృతిచెందింది. ఫ్లోరైడ్‌ బారినపడిన అంశాల స్వామి ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. బాధితుడిగానే కాదు తనలాంటి సమస్యతో బాధపడుతున్న వారి తరపున గట్టిగా పోరాడారు. ఫ్లోరైడ్‌ రక్కసి పోరాటంలో భాగంగా జలసాధన సమితిని స్థాపించిన దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి కన్వీనర్‌ కంచుకట్ల సుభాష్‌ అప్పట్లోనే ఫ్లోరైడ్‌ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లారు. స్వయంగా నాటి ప్రధాని వాజ్‌పేరు టేబుల్‌పై ఐదేండ్ల వయస్సున్న అంశాల స్వామిని కూర్చోబెట్టి సమస్యను వివరించారు. వరుసగా ఢిల్లీలో ఐదుగురు ప్రధాన మంత్రులను కలిసి బాధితుల గోడును వివరించారు.
గతేడాదే అంశాల స్వామి సొంత ఇంటి కల నెరవేరింది. మంత్రి కేటీఆర్‌ సాయంతో ఇంటిని పూర్తి చేశాడు. ఉపాధి కోసం హెయిర్‌ కటింగ్‌ షాపు ఏర్పాటు చేయించారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరుకాని కేటీఆర్‌.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంలో స్వామి ఇంటికి వెళ్లారు. స్వయంగా స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం గురించి ఆరా తీశారు. స్వామితో కలిసి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి భోజనం చేశారు. స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పించిన సంగతి తెలిసిందే.
మానవీయ కోణాన్ని తట్టి లేపిన స్వామి : సీఎం కేసీఆర్‌
ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్‌ సమస్యతోపాటు తక్షణమే గుర్తుకు వచ్చే పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తుకు చేసుకున్నారు. మానవీయ కోణాన్ని తట్టి లేపుతూ తెలంగాణ ఉద్యమంలో అంశాల స్వామి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా, ఫ్లోరోసిస్‌ రహిత శుద్ది చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ఫ్లోరోసిస్‌ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని తెలిపారు. సీఎం స్వామి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
స్వామి మతి పట్ల మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి
స్వామి మరణ వార్త విన్న మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. స్వామి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వామి ఫ్లోరోసిస్‌ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. ఎంతో మందికి ఆయన ఆదర్శమన్నారు. స్వామి ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్‌ చేశారు.

Spread the love