అమెరికాకు చెందిన అతి చిన్న మదుపరుల సంస్థ భారతదేశంలోని అతి పెద్ద, శక్తివంతమైన అదానీ గ్రూప్‌ను సవాలు చేసి, దాని పునాదులనే కదిలించేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చి అనే ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ అదానీ గ్రూపుపై 129 పేజీలతో నివేదిక వెలువరించింది. అదానీ గ్రూపునకు చెందిన ఏడు కంపెనీలతో సంబంధమున్న 578 అనుబంధ సంస్థల, షెల్ కంపెనీల నిధుల సేకరణ కార్యకలాపాలు, దేశం వెలుపల సాగించే కార్యకలాపాల గురించి అనేక ఆధారాలను అందులో పొందుపరిచింది. ఇది ‘కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద మోసం’గా హిండెన్ బర్గ్ నివేదిక పేర్కొంది.
నిధులు, బూటకపు కంపెనీల సంక్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఈ నివేదిక బయటపెట్టింది. ఈ షెల్ కంపెనీల్లో కొన్ని మారిషస్‌లో, సైప్రస్‌లో, యుఎఇలో ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేయడానికి తెలివిగా ఈ డొల్ల కంపెనీలను ఉపయోగించారు. అధిక రుణాలు, అంతంత మాత్రం ఆస్తులు మాత్రమే ఉన్న ఈ సంస్థల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉందని, రుణాలను చెల్లించగలిగే సామర్థ్యం వాటికి ఉందని చెప్పుకునేందుకు లిస్టెడ్ కంపెనీల ఆస్తి అప్పుల పట్టీ (బ్యాలన్స్ షీట్)లను చూపించారు. వాటికి డబ్బును మళ్లించడానికి ఈ డొల్ల కంపెనీలను వాడుకున్నారు. అదానీ కంపెనీల విలువను వాస్తవిక రేటు కన్నా దాదాపు 85శాతం ఎక్కువ చేసి చూపారని ఆ నివేదిక అంచనా వేసింది. స్టాక్ మార్కెట్లో దారుణమైన అవకతవకలకూ అకౌంటింగ్లో పెద్దయెత్తన అక్రమాలకూ పాల్పడుతూ ఇదంతా అదానీ గ్రూపు ఒక పక్కా పథకం ప్రకారం చేసిన చర్యగా హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది.
హిండెన్‌బర్గ్ నివేదికను ‘భారత్‌పై ఒక పథకం ప్రకారం జరిగిన దాడి’ అంటూ అదానీ గ్రూపు ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. అయితే, తన వాదనను సమర్థించుకోవడానికి అది ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. జాతీయవాదం ముసుగులో తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అది ప్రయత్నించింది. ”భారతదేశ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యత, వృద్ధి కథనం, వడివడిగా అడుగులు వేయాలన్న భారత్ ఆకాంక్షను చూసి సహించలేకనే ఈ రకమైన దాడి” చేస్తున్నారని గావు కేకలు పెడుతోంది.
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం వెంటనే కనిపించింది. నివేదిక వచ్చిన తరువాత వారంలోనే అదానీ గ్రూపు 6,700 కోట్ల డాలర్లను లేదా స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.5.6 లక్షల కోట్ల మార్కెట్ పెట్టుబడులను నష్టపోయింది. గౌతమ్ అదానీ తన సంపదలో 5వేలకోట్ల డాలర్ల మేరకు నష్టపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో మూడవ వ్యక్తిగా ఉన్న అదానీ ఒక్కసారిగా 15వ స్థానానికి పడిపోయారు.
అదానీ గ్రూపు సంపదలో చాలా వరకు దేశ సహజ వనరులను అనేక ఏండ్లుగా లూటీ చేస్తూ, ప్రభుత్వ నిధులను కొల్లగొట్టడం ద్వారా సమకూర్చుకున్నదే. అందువల్లే అదానీ గ్రూపు మోసపూరిత లావాదేవీలపై ప్రజలు ఇంతగా ఆందోళన చెందుతున్నారు. అదానీ గ్రూపు ఓడరేవులు, విమానాశ్రయాలకు సంబంధించి అతిపెద్ద ప్రయివేట్ ఆపరేటర్‌గా అవతరించింది. ఆహార ధాన్యాల గిడ్డంగుల్లో అతిపెద్దదిగా ఉంది. విద్యుత్ ట్రాన్స్‌మిషన్‌లో అయిదోవంతు భాగాన్ని కలిగి ఉంది, సిమెంట్ పరిశ్రమను శాసిస్తుంది. బొగ్గు తవ్వకాల్లో అతిపెద్ద వాటా కలిగి దేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ ప్రయివేటు ఉత్పత్తిదారుగా అదానీ గ్రూపు ఉంది. మోడీ ప్రభుత్వ చలవతోనే అదానీ ఇంత వేగంగా ఎదిగాడనేది నిర్వివాదాంశం.
జాతీయ బ్యాంకుల నుండి రుణాలు పొందడం, జీవిత బీమా సంస్థ వంటి సంస్థల నుండి వచ్చిన పెట్టుబడుల ద్వారా ఆస్తులు, కొనుగోళ్ళలో ఎక్కువ భాగాన్ని సమకూర్చుకోగలిగింది. అదానీ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టుబడుల ద్వారానే దాదాపు రూ.80వేల కోట్ల నిధులు వచ్చాయి. బ్యాంకుల నుండి ఈ గ్రూపు తీసుకున్న అన్ని రుణాల్లో 40శాతం వరకు ఎస్బిఐ నుండే వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలడం వల్ల ప్రజల పొదుపు మొత్తాలకు, ప్రభుత్వ నిధులకు ముప్పు వాటిల్లుతోంది. రూ.20వేల కోట్లను సమీకరించేందుకు అదానీ, బహిరంగంగా షేర్ల అమ్మకాలను ప్రారంభిస్తున్న సమయంలో సరిగ్గా హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడింది. అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలినప్పటికీ, అంతిమంగా ఆ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు కొందరు తమ సంస్థల తరపున కాకుండా వ్యక్తులుగా ఈ షేర్లను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం వల్లే అవి పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పెట్టుబడిదారుల మధ్య వర్గ సంఘీభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణ. ముకేష్ అంబానీ, సజ్జన్ జిందాల్, సునీల్ మిట్టల్, పంకజ్ పటేల్ వంటి బడా వ్యాపారవేత్తలు అదానీ కంపెనీ షేర్లను పెద్ద మొత్తంలో కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ మరుసటి రోజునే, అదానీ కంపెనీలు షేర్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. పెట్టుబడిదారు లందరికీ ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పాయి. రెండు అదానీ ఫ్రంట్ కంపెనీలు మలి విడత పబ్లిక్ ఆఫర్లో పెట్టుబడులు పెట్టాయన్న ఆరోపణలు రావడంతో అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
అదానీ గ్రూపు అకస్మాత్తుగా, అందరి దృష్టిని ఆకర్షించేలా ఎదిగిన తీరు, చాలా వేగంగా విస్తరించిన వైనాన్ని ప్రశ్నించే స్థితే లేకుండా చేశారు. ఏండ్ల తరబడి, గౌతమ్ అదానీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరుపై అనేక తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలు వచ్చాయి. బొగ్గు దిగుమతులకు అధిక మొత్తాలు చెల్లించినట్లు చూపించడం, తన కంపెనీలకు విదేశాల్లో నిధులు అందడంపై పారదర్శకత పాటించకపోవడం, పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడం, నియమ నిబంధనలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాజెక్టులను పొందిన తీరుపై మీడియాలో, వాణిజ్య విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూనే వచ్చారు. కానీ, వీటిల్లో ఏ అంశంపైనా సెబి కానీ, ఆర్బిఐ కానీ, ఇడి వంటి ప్రభుత్వ నియంత్రణా సంస్థలు కానీ స్పందించిన దాఖలాలు లేవు. తమ మోసపూరిత లావాదేవీలను ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడానికి, అణచివేయడానికి అదానీలు తమ ధన, రాజకీయ బలాన్ని ఉపయోగించారు. అదానీల ఒప్పందాలను ప్రశ్నించేలా కథనాలు రాసినా, ప్రసారం చేసినా సహించలేని స్థితి. ఆ కథనాలను ప్రచురించిన, లేదా ప్రసారం చేసిన వార్తా సంస్థలు, చానెళ్లపై పరువు నష్టం దావాలను ఒక అస్త్రంగా ప్రయోగించారు. ఉదాహరణకు, అదానీ ఎల్ఎన్జి టెర్మినల్‌లో ఇండియన్ ఆయిల్ కంపెనీ, గెయిల్ ఇండియాలు పెట్టుబడులు ఎందుకు పెట్టాయని ప్రశ్నిస్తూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించినందుకు 2017 నవంబరులో ‘ది వైర్’ పత్రికపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇటువంటి పరువు నష్టం కేసులను ఎదుర్కొంటున్న ఇతర జర్నలిస్టుల్లో పరంజరు గుహ థకుర్తా (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ), రవి నాయర్ తదితరులున్నారు. ఈ విధంగా కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కాలని అదానీ గ్రూపు ప్రయత్నించింది.
స్టాక్‌ల తారుమారు, మనీ లాండరింగ్, అకౌంటింగ్ మోసాలు, భారతదేశ అత్యున్నత పారిశ్రామికవేత్త పేరు ప్రతిష్టకు భంగం కలిగిచే కుట్రగా చూపించే యత్నాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ అదానీ-హిండెన్‌బర్గ్ అధ్యాయం నుంచి తీసుకోవాల్సిన అసలు పాఠం మరుగున పడకూడదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన దన్నుతోనే అదానీ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని చూడకపోతే అదానీ కథ అసంపూర్ణమే అవుతుంది. 2002లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినపుడు అదానీ, మోడీ మధ్య సంబంధాలు మొదలయ్యాయి. అప్పటి నుండి అదానీ అదృష్టాలన్నీ మోడీ రాజకీయ పంథాతో పెనవేసుకుని సాగాయి. 2014లో మోడీ ప్రధాని అయ్యారు. ఆ సంవత్సరంలో రూ.50.4 వేల కోట్లుగా ఉన్న అదానీ సంపద, 2022 నాటికి వచ్చేసరికి అమాంతంగా రూ.10.30లక్షల కోట్లకు పెరిగిపోయింది. మోడీకి అత్యంత ప్రీతిపాత్రుడైన పారిశ్రామికవేత్త అదానీకి ఇక పట్ట పగ్గాల్లేవు. ఏ ప్రభుత్వ నియంత్రణా సంస్థ కానీ, అధికారి కానీ ఆయనను ప్రశ్నించే సాహసం కానీ, అడ్డుకునే యత్నం కానీ చేయలేని స్థితి. ప్రభుత్వ అండ చూసుకునే అదానీ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతగా విస్తరించుకోగలిగింది. ఇటీవలి కాలంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇదొక అత్యంత దారుణమైన ఉదాహరణ. మోడీ-అదానీ బంధం ఈనాడు దేశాన్ని పాలిస్తున్న హిందూత్వ-కార్పొరేట్ శక్తుల పొత్తును నగంగా బయటపెట్టింది. మోడీ ప్రభుత్వ మద్దతుతో తాను ఈ తుపానును ఎదుర్కోగలనని అదానీ చాలా ధీమాగా ఉన్నారు. కానీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడాన్ని, మతోన్మాద-కార్పొరేట్ శక్తులు కుమ్మక్కయి తమ జీవనోపాధిని దెబ్బ తీయడాన్ని స్వయంగా చూస్తున్న ఈ దేశ పౌరులకు మాత్రం ఈ దోపిడీ, అక్రమ సంపాదనలకు గాను అదానీలను జవాబుదారీ చేయడమనేది అత్యంత ముఖ్యమైన అంశంగా ఉన్నది. అందువల్ల, అదానీ గ్రూపునకు సంబంధించిన మొత్తం ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలన్నింటిపైనా నియంత్రణా సంస్థలు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు దర్యాప్తు జరిపేలా చూసేందుకు కృతనిశ్చయంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ రీసెర్చి సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలి.
(పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం)