– రూ.44,026 కోట్లు కేటాయించడం ఆనందకరం : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తన శాఖలకు మొత్తంగా రూ.44,026 కోట్లు కేటాయించడం ఆనందకరంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని తెలిపారు. ఈ బడ్జెట్లో సింహభాగంగా పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్ల రూపాయలు కేటాయించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, మిషన్ భగీరథకు 600 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి తెలంగాణ పల్లెలు రోల్ మోడల్‌గా మారాయనీ, అభివృద్ధిలో అందరితో పోటీ పడి మొదటి స్థానంలో నిలుస్తున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో 13 జాతీయ అవార్డులొచ్చాయని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలోనూ నేడు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ పెట్టీ పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. హరిత హారంలో భాగంగా 710 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నర్సరీలు ఏర్పాటు చేశామని వివరించారు. పల్లెప్రకృతివనాలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో 2 వేల కోట్లు ప్రతిపాదించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.