బరువు తగ్గాలంటే ఏం తినాలి..?

నాజూకైన శరీరం ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ నేటి యువతలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే ఊబకాయానికి, అధిక బరువుకు అనేక కారణాలు ఉంటాయి. థైరాయిడ్‌, జన్యుపరంగా వచ్చే లోపాలు ఊబకాయానికి కారణాలు కావచ్చు. ఊబకాయం నుంచి బయటపడి నాజూకుగా ఉండాలంటే మొదటిగా చేయాల్సింది ఫుడ్‌ కంట్రోల్‌. టైమ్‌తో సంబంధం లేకుండా ఏదిపడితే అది, ఎక్కడపడితే అక్కడ తినడం ఆరోగ్యానికి ప్రమాదం. బయట తయారు చేసే ఆహారాలలో అధిక శాతం కల్తీవే ఉంటున్నాయి. సన్నగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి తమకే తెలియకుండా లావయ్యేందుకు ఇవే కారణమవుతున్నాయి. ఇక అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించే వారిలో చాలా అనుమానాలుంటాయి. ఆహార మార్పుల్లో ఎలాంటివి తినాలి..? ఎలాంటివి తినకూడదు..? అన్నది పెద్దప్రశ్న అయితే మరి కొందరు ఒకపూట భోజనం తినకుండా ఉంటే బరువు తగ్గుతామనే అపోహలో ఉంటారు. ఇలా రకరకాల ప్రశ్నలు, అపోహలు, ఆలోచనలు మెదడులో మెదులుతుంటాయి. మరి బరువు తగ్గాలనుకునేవారు ఎటువంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కూరగాయ ముక్కలను పచ్చిగా తినేకంటే.. దోరగా వేయించి తినడం ఎంతో మేలు. వేయించడం వల్ల వాటిలో తక్కువ క్యాలరీలు ఉండటంతో పాటు కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన ఉంటుంది. అలాగే ఉడికించిన కూరగాయలను తినడం ద్వారా కూడా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు.
చాలా మందికి బ్రేక్‌ ఫాస్ట్‌ సమయంలో ఏంతినాలన్న ప్రశ్న వస్తుంది. ఆ సమయంలో టిఫిన్లు వద్దనుకుంటే మొలకెత్తిన విత్తనాలు తినడం, రాగి జావ తాగడం మంచిది. టిఫినే చేయాలనుకునేవారు మూడు ఇడ్లీ లేదా రెండు దోసెలు టమాటా చట్నీతో తీసుకోవడం మంచిది. అవి కూడా ఇంట్లో చేసినవే తీసుకోవాలి.
బ్రేక్‌ ఫాస్ట్‌కి లంచ్‌కి మధ్యలో ఏదైనా జ్యూస్‌ తీసుకోవచ్చు. కేలరీలు తక్కువగా ఉండే జ్యూస్‌ తాగడం ఉత్తమం. పుచ్చకాయ, బత్తాయి జ్యూస్‌లు లేదా కొబ్బరి నీరు తాగడం వల్ల ఒంటిలో ఉండే నీరు బయటికి పోతుంది. అలాగే ఒంటిలో వేడిని కూడా తగ్గిస్తాయి. జ్యూస్‌లు తాగే వీలులేని వారు నిమ్మకాయ నీరు తాగవచ్చు.
లంచ్‌లో రైస్‌ ఎంత తీసుకుంటామో కూర కూడా అంతే మోతాదులో తీసుకోవాలి. అన్నం ఎక్కువ, కూర తక్కువగా తినడం వల్లే చాలామందికి ఊబకాయం పెరుగుతుంది. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. వారానికి కనీసం మూడుసార్లైనా ఆకుకూరలు పుష్కలంగా తింటే మంచిది.
ఐరన్‌ తగ్గినా కూడా శరీరం బరువు పెరగడం, అధికంగా చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారు నల్లబెల్లంతో చేసిన పల్లీల పట్టి లేదా జీడిపప్పు పట్టీ సాయంత్రం సమయంలో తినడం మంచిది. నల్లబెల్లంతో చేసిన సగ్గుబియ్యం కూడా తాగవచ్చు. నల్లబెల్లం వంటకాలు తినడం వల్ల శరీరంలో ఐరన్‌ పెరిగి ఉత్సాహంగా ఉంటారు.

Spread the love