బస్సుల్లో రేడియో ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బస్సుల్లో ప్రయాణికుల వినోదం కోసం ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ను ప్రవేశపెట్టారు. శనివారం ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ కూకట్‌పల్లి బస్‌డిపోలో దీన్ని ప్రారంభించారు. ఫైలట్‌ ప్రాజెక్టుగా 9 సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో వీటిని ఏర్పాటుచేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉప్పల్‌-సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌-సికింద్రాబాద్‌, గచ్చిబౌలి-మెహిదిపట్నం, సికింద్రాబాద్‌-పటాన్‌చెరువు, కూకట్‌పల్లి-శంకర్‌పల్లి, కొండాపూర్‌-సికింద్రాబాద్‌, కోటి-పటాన్‌చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్‌ మార్గాల్లో నడిచే బస్సుల్లో రేడియోలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. రేడియోలో పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యత, టీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రయాణికులకు వివరిస్తూ కార్యక్రమాలను రూపొందించామన్నారు. అలాగే మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలు పెంపొందించే నీతి కథలను కూడా రేడియోలో ప్రసారం చేస్తారని చెప్పారు. ప్రయాణీకులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌, కూకట్‌పల్లి డిపో మేనేజర్‌ ఇషాక్‌ బిన్‌ మహ్మద్‌, మెకానికల్‌ సూపరింటెండెంట్‌ జయరాం, ఎలక్ట్రీషియన్‌ కేవీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love