బిలియనీర్ల కన్న మధ్య తరగతి

ఆదాయ పన్నుఎక్కువ!దేశాభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ఆధారం. పన్నులు లేకుండా ప్రభుత్వం నడవదు. ప్రజాసంక్షేమం, ప్రగతి రథం కదలడానికి నిధులు పన్నుల నుంచే వాసులు చేయబడతాయి. పన్ను వసూళ్లలో వేతన జీవులు ఎలాంటి అక్రమ మార్గాలను వెతక్కుండా సరైన పద్ధతిలో పన్నులను కచ్చితంగా, సకాలంలో చెల్లిస్తున్నారు. వ్యాపార వర్గాలు పన్నుల ఎగవేతలకు దొడ్డిదారులు అన్వేషిస్తున్నారు. బిలియనీర్ల పన్నుల రేట్లను ప్రభుత్వమే రాయితీల పేరుతో తగ్గిస్తున్నది. నిరుపేదలు, వ్యవసాయ వర్గాలు పన్ను పరిధిలోకి రావడం లేదు. మధ్య తరగతి వేతన జీవులే ప్రభుత్వానికి తేలికగా దొరుకుతున్నారు. ఇలాంటి భారత మధ్య తరగతి వర్గాలు పన్ను పోటుతో నవ్వలేక, ఏడ్వలేక అయోమయ స్థితిలో త్రిశంకుస్వర్గంలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. సంపన్న వర్గాలకు కార్పొరేట్‌ పన్ను 30శాతం నుంచి 22శాతానికి తగ్గించడంతో పాటు నూతన మాన్యుఫాక్చర్‌ కంపెనీలకు పన్ను 15శాతం మాత్రమే వసూలు చేస్తుండగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం 30శాతం వరకు పన్నులు వసూలు చేయడం విచారకరం. ఆర్థిక సంవత్సరాలు 2020, 2021ల్లో బిలియనీర్ల కార్పొరేట్‌ పన్నులు 30 నుంచి 22శాతానికి తగ్గించడంతో ప్రభుత్వం రూ.1,84,000 కోట్ల ఆదాయం కోల్పోయింది. మధ్య తర గతి 30శాతం వరకు పన్నులు చెల్లిస్తుండగా బిలియనీర్లు 22శాతం మాత్రమే కట్టడం సమర్థనీయం కాదు.
మధ్య తరగతి ఆదాయ పన్ను తగ్గించలేదా!
వేతన మధ్య తరగతి వర్గాలకు పన్నుల మినహాయింపు కనీస ఆదాయం ప్రస్తుత రూ.2.50లక్షల నుంచి 5.0లక్షలకు పెంచాలని, తదుపరి స్లాబుల్లో పన్ను రేట్లు గణనీయంగా తగ్గించాలనే డిమాండ్‌ గత కొన్నేండ్లుగా వినిపిస్తున్నది. ఇదే విషయాన్ని దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సమర్థిస్తూ మాట్లాడటం తాను కూడా మధ్య తరగతి పన్ను చెల్లింపు వర్గానికి చెందిన దానినే అంటూ కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది. మధ్య తరగతి కడుతున్న పన్నులతో ఆ వర్గానికి అవసరమైన స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి, మెట్రో రైల్‌ సదుపాయాలు, నగర మౌలిక వసతుల అభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపుదల లాంటి సేవలు సుసాధ్యం అవుతున్నాయని ప్రభుత్వం వివరిస్తున్నది. భారత్‌లో వార్షిక ఆదాయం రూ.5 లక్షల నుంచి 30లక్షల వరకు ఉన్న వర్గాలను మధ్య తరగతిగా, సాలీనా 30లక్షల కన్న అధిక ఆదాయం కలిగిన వర్గాలను ధనవంతులు, సంపన్నుల కుబేరులుగా వర్గీకరించబడ్డారు. ఇండియాలో 3 శాతం సంపన్న వర్గాలు, 30శాతం మధ్య తరగతి వర్గాలు, 67శాతం పేద వర్గాలు ఉన్నారని ఇటీవల ‘ప్రైస్‌ డాటా ఏజెన్సీ’ విశ్లేషించింది. కుబేరుల పన్ను రేట్లు 30శాతం కన్న అధికంగా, మధ్య తరగతి వర్గాలకు 25 శాతం కన్న తక్కువగా ఉండాలని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మధ్య తరగతి ఆదాయ పన్ను విధానాలు
సగటు భారతీయుడు 54శాతం వరకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులను కడుతున్నారని తెలుస్తున్నది. భారత్‌లో ప్రస్తుత నూతన పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.2.5లక్షల వరకు పన్ను మినహయింపు ఉండగా, 2.5లక్షల నుంచి 5.0లక్షల ఆదాయం వరకు 5శాతం ఆదాయ పన్నులు కడుతున్నారు. వార్షిక ఆదాయం 5.0 నుంచి 7.5లక్షల వరకు 10శాతం పన్నులు, 7.5 నుంచి 10లక్షల వరకు 15శాతం ఆదాయ పన్నులు వసూలు చేస్తున్నారు. అనంతరం 10 నుంచి 12.5లక్షల వరకు 20శాతం, 12.5 నుంచి 15లక్షల వరకు 25శాతం ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ.15లక్షలు దాటిన వారికి 30శాతం ఆదాయ పన్నులు చెల్లించడం జరుగుతోంది. పాత విధానం ప్రకారం 2.5 నుంచి 5లక్షల వార్షిక ఆదాయానికి 5శాతం, 5 నుంచి 10లక్షల వరకు 20శాతం, 10 లక్షల పైన ఆదాయానికి 30శాతం పన్నులు వసూలు చేశారు. పన్ను చెల్లింపుదారులకు పాత లేదా కొత్త విధానాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కల్పించారు. నూతన పన్ను విధానంలో చెల్లించే వేతన జీవులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌, ఇంటి కిరాయి, సెలవు ప్రయాణ సహాయం, గృహ రుణాలు, సెక్షన్‌ 80సి, 80డి, 80సిసిడి, పిపియఫ్‌, యన్‌యస్‌సి, ఈపియఫ్‌ లాంటి పన్ను రాయితీ ప్రయోజనాలు కల్పించకపోవడం ఆక్షేపణీయమే అని వింటున్నాం.
2017-18 నుంచి నేటి వరకు నూతన పన్ను విధానం ప్రవేశ పెట్టినప్పటికీ మధ్య తరగతి వర్గాల బేసిక్‌ ఆదాయ పన్ను మినహా యింపు లిమిట్‌లో పెద్ద మార్పులు కనిపించ లేదు. రాబోయే అసెంబ్లీతో పాటు 2024 పార్లమెంట్‌ ఎన్నిక లను దృష్టిలో పెట్టు కొనైనా ఇప్పుడు మధ్య తరగతి వర్గాలకు ఊరట లభించే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరముంది.
– డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి
99497000037

Spread the love