– బీరిశెట్టి గూడెం సర్పంచ్ నెహ్రూ ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-దంతాలపల్లి
గ్రామ అభివృద్ధి పనుల బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో.. మహ బూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశేట్టిగూడెం గ్రామ సర్పంచ్ గుగులోతు నెహ్రూ నాయక్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. టీఆర్‌ఎస్ నుంచి తొలిసారిగా సర్పంచిగా పోటీ చేసి గెలుపొందిన నెహ్రూ నాయక్.. కొన్ని నెలలుగా అభివృద్ధిలో భాగంగా.. గ్రామపంచాయతీలో వాకింగ్ ట్రాక్, గ్రావెలింగ్, ఫెన్సింగ్, మోటార్ రిపేర్లు, పైపులైన్ రిపేర్లు, వీధి లైట్లు, బ్లీచింగ్ పౌడర్ తదితర పనుల కొరకు సుమారు రూ.6 లక్షలు అప్పులు చేసి పనులు చేయించాడు. ఆయా పనులకు బిల్లులు రాక, కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై శుక్రవారం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన తొర్రూర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, గ్రామ ఉపసర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని సర్పంచ్ తల్లి పీప్లా ఆరోపించారు.